వానతో పాటు వస్తాడు... ఊడ్చుకుపోతాడు

Villagers Catch Thief Red Handed in Visakhapatnam - Sakshi

విశాఖపట్నం , కోటవురట్ల(పాయకరావుపేట): గ్రామీణ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడు ఎట్టకేలకు  చిక్కాడు. ఈ దొంగకు ఓ విచిత్ర అలవాటు ఉంది. వర్షం  పడినప్పుడు   ఇళ్లలో ఎవరూ లేని సమయం చూసి, చొరబడి అందినకాడికి పట్టుకుపోతాడు. మండలంలో మూడో సారి దొంగతనం చేస్తుండగా గ్రామస్తులకు చిక్కాడు.  వివరాల్లోకి వెళితే... ఇటీవల జల్లూరులో రెండు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. ఈ రెండిళ్లల్లో కూడా  వర్షం పడుతున్న సమయంలోనే దొంగతనాలకు పాల్పడ్డాడు. రెండు చోట్ల సుమారు 12 తులాల బంగారాన్ని అపహరించుకుపోయాడు.  శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బి.కె.పల్లి గ్రామంలో  పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న పెట్ల నూకాలతల్లి ఇంట్లోకి  చొరబడ్డాడు.

ఆ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. సరిగ్గా అప్పుడే వారు పొలానికి వెళ్లడాన్ని గమనించిన దొంగ  ఇంట్లో ప్రవేశించాడు. అయితే ఏదో పనిపై ఇంటికి తిరిగొచ్చిన నూకాలతల్లి  తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించింది.  అనుమానం వచ్చి గదిలోకి తొంగి చూసింది. బీరువా తలుపులు తెరిచి చక్కబెడుతూ ఓ కుర్రాడు కనిపించాడు.  నూకాలతల్లి నెమ్మదిగా బయటకు వచ్చి తలుపులకు గెడ వేసి చుట్టుపక్కల వారిని పిలుచుకొచ్చి ంది. బయట జనాల గోల విన్న దొంగ ఇంకొక గుమ్మం నుంచి బయటకు వచ్చి పారిపోయేందుకు ప్రయత్నించేసరికి అందరూ కలిసిపట్టుకున్నారు. గట్టిగా నిలదీసేసరికి జల్లూరులో జరిగిన రెండు దొంగతనాలను తానే చేసినట్టు ఒప్పుకొన్నాడని గ్రామస్తులు తెలిపారు. చోరీలకు పాల్పడుతున్న...  బిళ్ల నందూరుకు చెందిన  బొత్స ఎర్రినాయుడిపై  పలు దొంగతనాల  కేసులు నమోదై ఉన్నాయని  గ్రామస్తులు తెలిపారు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌కు ఎర్రినాయుడిని అప్పగించారు. నర్సీపట్నం రూరల్‌ సీఐ అప్పలనాయుడు  విచారణ చేశారు. ఎస్‌ఐ మధుసూదనరావును వివరాలు కోరగా  విచారణ జరుగుతోందని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top