మనూళ్లో తాగిన మైకంలో వేరే వాళ్ల చెప్పులు వేసుకుని వెళ్లేవారిని చూస్తుంటాం, అమెరికాలో ఒక ఘరానా దొంగ మందు మత్తులో మ్యూజిక్ దుకాణంలోకి దూరాడు. రెండు ఖరీదైన మ్యాండోలిన్లను లేపేశాడు. సీన్ కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత దొంగగారిలో జ్ఞానోదయం కలిగింది.
అసలేం జరిగిందంటే..
న్యూజెర్సీలోని ఒక పాతకాలపు మ్యూజిక్ దుకాణంలోకి డిసెంబర్ 22న ఒక దొంగ ప్రవేశించాడు. సుమారు రూ.7 లక్షల రూపాయల విలువైన రెండు మ్యాండోలిన్లను గుట్టుచప్పుడు కాకుండా తన కోటు లోపల దాచేసి చెక్కేశాడు.
మైకం దిగాక పశ్చాత్తాపం
పాపం, ఆ దొంగగారికి మత్తు దిగాక తాను ఏం చేశానో తెలిసి గుండె ఝల్లుమంది! వెంటనే ఆ రెండు వాయిద్యాలను రెండు క్యారీ బ్యాగుల్లో సర్దుకుని, నేరుగా మ్యూజిక్ దుకా ణం గుమ్మం ముందు పెట్టేసి పరుగు లంఘించుకున్నాడు. అంతేనా.. దాంతో పాటు క్షమాపణ లేఖ కూడా రాసి పెట్టాడు. అందులో మేటర్ చూసి షాపు యజమా ని బజ్జీ లెవిన్ బుర్ర పాడైపోయింది. ‘అయ్యా క్షమించండి! ఆ రోజు ఫుల్లుగా తాగి ఉన్నాను. అందుకే ఇలా జరిగింది. మెర్రీ క్రిస్మస్! మీరు చాలా మంచోళ్ళు సార్!’.. ఇదీ లేఖ సారాంశం.
ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు
అది చూసిన యజమాని బజ్జీ లెవిన్, ‘వీడెవడ్రా బాబూ ఇంత వెరైటీగా ఉన్నాడు’.. అని ఆశ్చర్యపోయాడు. వస్తువులు పెట్టేసి దొంగ పరిగెడుతుంటే, యజమాని కూడా వెనకాలే పరుగు అందుకున్నాడు. కానీ ఆ దొంగగారు ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా మాయమైపోయారు. ‘నా జీవితంలో ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదు బాబోయ్’.. అని యజమాని నెత్తీనోరు కొట్టుకుంటున్నాడు.
చిలిపి దొంగ కోసం గాలింపు
చివరికి 911కి ఫోన్ చేస్తే, పోలీసులు ఇప్పుడు ఆ మందుబాబు కోసం గాలిస్తున్నారు. మందులో ఉన్నప్పుడు మ్యాండోలిన్ గుర్తొచ్చింది.. మత్తు దిగాక మాత్రం మనస్సాక్షి గుర్తొచి్చంది’.. అని జనం నవ్వుకుంటున్నారు. పాపం.. మందు కొట్టి దొంగతనం చేసినా, ’మెర్రీ క్రిస్మస్’ చెప్పడం మాత్రం మర్చి పోలేదు మన చిలిపి దొంగ.


