గ్యాంగ్‌ వార్‌: ఇప్పుడు దృష్టంతా కాల్‌డేటా పైనే!

Vijayawada Police Searching For Gangwar Links - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడలోని పటమట తోటవారి వీధిలో ఇటీవల జరిగిన గ్యాంగ్‌వార్‌ లింక్‌లపై పోలీసులు ముమ్మరంగా శోధిస్తున్నారు. డీసీపీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలోని 6 టీమ్‌లు ప్రత్యేకంగా దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. గ్యాంగ్‌వార్‌ ఘటనకు సంబంధించి కాల్‌డేటా ఆధారంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు మరికొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. తొలుత మాజీ రౌడీషీటర్‌ తోట సందీప్‌ దగ్గర కోడూరి మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు అనుచరుడుగా ఉండేవాడు. సందీప్‌ చేసే సెటిల్‌మెంట్లలో పండు చురుగ్గా పాల్గొనేవాడని పోలీసుల విచారణలో తేలింది. చదవండి: గ్యాంగ్‌వార్‌లో వారి ప్రమేయం లేదు

ఇలా చాన్నాళ్లపాటు వీరిద్దరు కలిసి సెటిల్‌మెంట్లు చేశారు. వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో సందీప్‌ బ్యాచ్‌ నుంచి పండు బయటకొచ్చి వేరే గ్రూపు పెట్టాడు. పండుతో సఖ్యతగా ఉండే సందీప్‌ బ్యాచ్‌లోని కొంతమంది అతని వెంట వచ్చారు. సందీప్‌తోనే శతృత్వా న్ని పెంచుకున్న పండు ఆయన గ్యాంగ్‌లో ఇతర సభ్యులతో మాత్రం విరోధం పెట్టుకోలేదు. అవసరమైనప్పుడు ఇరు గ్యాంగ్‌ల సభ్యులు కలుసుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవ డం వంటివి జరిగాయని పోలీసులు ధృవీకరిస్తున్నారు. సందీప్, పండులు గ్యాంగ్‌వార్‌కు కొన్ని రోజుల కిందట మంగళగిరికి చెందిన రౌడీషీటర్లు కిరణ్‌కుమార్, రఘునాథ్‌ అలియాస్‌ ఏవీఎస్‌లతోపాటు మరికొందరు యువకులతో కలిసి తాడేపల్లి మండలం కుంచినపల్లి, మంగళగిరి మండలం కురుగల్లు గ్రామాలకు వెళ్లి సెటిల్‌మెంట్లలో పాల్గొన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. చదవండి: గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే!

ఈ వ్యవహరంపై పూర్తిస్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సందీప్‌పై దాడిచేసిన కేసులో నిందితుడైన రేపల్లె ప్రశాంత్‌ గుంటూరులోని ఓ ప్రైవేటు యూనివర్సీటిలో చదువుతున్నాడు. ఇతను ఆ యూనివర్సిటీలో జరిగే వ్యవహారాలను పండు దృష్టికి తీసుకురావడం,  ఆ తర్వాత మంగళగిరి బ్యాచ్‌ను రంగంలోకి దించడంలో కీలకపాత్ర పోషించేవాడని పోలీసుల వద్ద సమాచారం ఉంది. మొత్తం మీద సందీప్, పండు వ్యవహారాలపై అధికారులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ గ్రూప్‌ సభ్యుల కాల్‌డేటాను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ కాల్‌డేటా ఆధారంగా ఈ గ్రూపులతో ఎవరెవరికి లింక్‌లు ఉన్నాయనే దానిపైనా దృష్టి సారించారు. వీటి ఆధారంగా దర్యాప్తు మరింత సమగ్రంగా జరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. చదవండి: గ్యాంగ్‌ వార్‌; వెలుగులోకి కొత్త విషయాలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top