స్థల వివాదం వల్లే గ్యాంగ్‌వార్‌

Police Commissioner CH Dwaraka Thirumala Rao With Media On Bejawada Gang War - Sakshi

పండు గ్యాంగ్‌ సభ్యులు 13 మంది అరెస్టు 

సందీప్‌ హత్యకేసులో వీరందరిపైనా రౌడీషీట్‌  

గ్యాంగ్‌వార్‌లో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు 

నగరంలో గ్యాంగ్‌లను గుర్తిస్తున్నాం.. రౌడీ కార్యకలాపాలపై ఉక్కుపాదం 

బెజవాడ పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలోని ఏడు సెంట్ల స్థల వివాదం పటమటలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్‌కు దారి తీసిందని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు13 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌కు సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్‌ మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  

ఏం జరిగిందంటే.. 
యనమలకుదురుకు చెందిన ప్రదీప్‌రెడ్డి, కానూరుకు చెందిన ధనేకుల శ్రీధర్‌ ఇద్దరు కలిసి యనమలకుదురులోని 7 సెంట్ల స్థలంలో రూ.1.50 కోట్ల అంచనాతో 14 ఫ్లాట్ల గ్రూప్‌ హౌస్‌ నిర్మాణం 2018లో చేపట్టారు.  
ఇందుకుగానూ ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌ మొదట రూ.40 లక్షల చొప్పున రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. తర్వాత ప్రదీప్‌రెడ్డి నుంచి డబ్బు ఇవ్వకపోవడంతో శ్రీధర్‌ మిగతా రూ.70 లక్షలు వెచ్చించి 2019లో నిర్మాణాన్ని పూర్తిచేశారు. అయితే ఇద్దరి వాటా కింద రావాల్సిన ఫ్లాట్లన్నింటినీ శ్రీధరే తన పేరిట ఉంచుకోవడంతో వివాదం మొదలైంది.  
దీంతో బట్టు నాగబాబు అలియాస్‌ చిన్న నాగబాబును ప్రదీప్‌రెడ్డి ఆశ్రయించి తన వాటా తనకు ఇప్పించాలని కోరాడు. మే 29న ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌లను నాగబాబు పంచాయితీకి పిలిచాడు.  
ఈ పంచాయితీకి తోట సందీప్, కోడూరి మణికంఠ అలియాస్‌ పండులను కూడా నాగబాబు పిలిచాడు.  
ఆ తర్వాత తాను మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్లిన చోటుకి నువ్వెందుకొచ్చావు అని పండును సందీప్‌ ఫోన్‌లో నిలదీశాడు. తీవ్రస్థాయిలో బెదిరించడంతో ఇరువురు ఒకరిని ఒకరు దూషించుకున్నారు.  చదవండి: పండు.. మామూలోడు కాదు!

ఇంటికెళ్లి గొడవ.. 
అదేరోజు అర్ధరాత్రి ఇదే విషయంపై పండును స్వయంగా అడగడానికి తోట సందీప్, అతని సోదరుడు జగదీష్‌తోపాటు మరికొంత మంది అనుచరులతో పండు ఇంటికెళ్లి అతని తల్లితో గొడవ పడి వెళ్లిపోయారు.  
సందీప్‌ ఇంటికొచ్చి తన తల్లితో గొడవపడిన విషయం తెలిసి పండు 30వ తేదీన ఉదయం పటమటలో సందీప్‌ నిర్వహిస్తున్న శివబాలాజీ స్టీల్స్‌ దుకాణం వద్దకు వెళ్లి.. ఆ సందీప్‌ లేకపోవడంతో షాపులో ఉన్న సాగర్, రాజేష్‌ను కొట్టి గాయపరిచాడు.  
ఈ విషయం తెలుసుకున్న సందీప్‌ పండుకు ఫోన్‌ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో చివరకు ఇరువురు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు.  
ఆపై సాయంత్ర 4.30 గంటల సమయంలో పటమట తోటావారి వీధిలోని గ్రేస్‌ చర్చ్‌ వద్ద గల ఖాళీ ప్రదేశంలో సందీప్, పండులకు రెండు గ్రూపులు సమావేశమయ్యారు.  
ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన కారం కళ్లలో చల్లి.. కత్తులు, రాడ్లు, బ్లేడ్లు విచక్షణరహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.  
ఈ గ్యాంగ్‌వార్‌లో తోట సందీప్, కోడూరి మణికంఠలు తీవ్రంగా గాయపడగా వారి అనుచరులు వారిని ఆస్పత్రులకు తరలించారు.  
తోట సందీప్‌ పటమటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 31వ తేదీ సాయంత్రం 5.50 గంటల సమయంలో మృతి చెందాడు. పండు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.  
ప్రత్యక్ష సాక్ష్యులు, సీసీ టీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించాం. 
ఈ కేసులో కొట్లాటకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశాం. ఈ కేసులో ఉన్నవారందరిపై రౌడీషీట్స్‌ తెరిచామని సీపీ స్పష్టం చేశారు. చదవండి: గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే! 

రౌడీ కార్యకలాపాలపై నిఘా.. 
గ్యాంగ్‌వార్‌కు సంబంధించి వరుసగా రెండు రోజులపాటు ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదంపై పోలీసులకు సమాచారం లేదు. కోవిడ్‌ విధుల్లో ఉన్న కారణంగా రౌడీషీటర్లపై నిఘా పెట్టలేదు. కౌన్సెలింగ్‌ కూడా ఇవ్వలేదు. ఇకపై విజయవాడలోని రౌడీషీటర్లపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తాం. అయితే ఈ గ్యాంగ్‌వార్‌కు రాజకీయ నాయకులకు సంబంధం లేదు. అయితే కొంత మంది రాజకీయ నాయకులు వీళ్లను వాడుకున్నట్లు తెలుస్తోంది. కులం, వర్గం, పారీ్టలు అని చూడకుండా తప్పుచేస్తే ఎవరినైనా శిక్షిస్తాం. రౌడీ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం.  

నిందితుల వివరాలు..  
రేపల్లె శ్రీనివాస్‌(సనత్‌నగర్‌), ఆకుల రవితేజ(యనమలకుదురు), పందా ప్రేమకుమార్, పందా ప్రభుకుమార్‌ (పటమట), బాణావత్‌ శ్రీను నాయక్‌(రామలింగేశ్వర నగర్‌), ఎల్‌ వెంకటేశ్‌(పటమట), బూరి భాస్కరరావు(సనత్‌నగర్‌), పి.సాయిప్రవీణ్‌ కుమార్‌(తోటావారి వీధి), పొన్నాడ సాయి, సిర్రా సంతో‹Ù, యర్రా తిరుపతిరావు (పటమట), ఓరుగంటి దుర్గాప్రసాద్, ఓరుగంటి అజయ్‌(యనమలకుదురు). 

స్వాధీనం చేసుకున్న ఆయుధాలు.. 
కొబ్బరి బొండాల కత్తి, పొడవాటి కత్తి, స్నాప్‌ కట్టర్, కోడి పందేలకు వినియోగించే కత్తి, ఓ రాడ్డు, ఫోల్డింగ్‌ బ్లేడ్లు, నాలుడు బ్లేడ్లు, మూడు బైక్‌లు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top