తండ్రి పాపమా ?..  విధి శాపమా ?

Two Mentally Ill Children Murdered In Guntur - Sakshi

మాచర్లలో ఇద్దరు మానసిక దివ్యాంగుల హత్య

తండ్రే కడతేర్చినట్లు అనుమానం

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

లోకం పోకడ తెలియని అన్నదమ్ములు ఆ పసోళ్లు.. మేనరికం పాపమో.. విధి శాపమో.. పదేళ్లు వచ్చినా పట్టుమని పది మందితో ఆడుకోలేని మానసిక దివ్యాంగులు వాళ్లు .. ఆనందమొచ్చినా.. ఆవేదన వచ్చినా ఎదిగీ ఎదగని ఆ రెండు మనసులకే అర్థమయ్యేవి. అనురాగం నిండిన అమ్మ పేగులో ఆవేదన.. మమకారం పంచిన నాన్న గుండెల్లో ఆందోళన వాళ్ల కన్నీళ్లలో కలిసిపోతుండేవి. శనివారం ఆ తండ్రి ఆందోళన క్షణికావేశంగా మారిందో.. కన్నబిడ్డలు పడుతున్న కష్టం చూసి కడుపు తరుక్కుపోయిందో.. ఆ పిల్లల పాలిట మృత్యువైంది. మాచర్ల పట్టణ శివారులో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఉషోదయాన విషాద గీతికై జిల్లా నలుమూలలా ప్రతిధ్వనించింది.  

ఇద్దరు మానసిక దివ్యాంగుల హత్య
మాచర్లరూరల్‌ : పుట్టుకతో మానసిక వికలాంగులుగా ఉన్న చిన్నారులు ఇంట్లోనే హత్యకు గురయ్యారు. తండ్రే వారిని హతమార్చి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. పట్టణ శివారులోని వికాస్‌ డీఎడ్‌ కాలేజి సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.  వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామానికి చెందిన కుర్రి బ్రహ్మారెడ్డి, అనిత దంపతులు ఉపాధి కోసం  5 ఏళ్ల నుంచి పట్టణ శివారులోని శ్రీ వికాస్‌ డీఎడ్‌ కళాశాల సమీపంలో నివసిస్తున్నారు. బ్రహ్మారెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

వీరికి శశాంక్‌రెడ్డి (11), అదీప్‌రెడ్డి (9), 9 నెలల చింతన్‌రెడ్డి  అనే ముగ్గురు కుమారులున్నారు. వీరిలో శశాంక్‌రెడ్డి, అదీప్‌రెడ్డి పుట్టకతోనే మానసిక దివ్యాంగులుగా జన్మించారు. వీరి ఆరోగ్యం కోసం వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వారిలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే బ్రహ్మారెడ్డి  పిల్లలతో కింద పోర్షన్‌లో నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుంచి బ్రహ్మారెడ్డి బయటకు వెళ్లిపోవడం గమనించిన నాయనమ్మ మాలకొండమ్మ తెల్లవారుతున్నా బ్రహ్మారెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెంది ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులను పరిశీలించగా శశాంక్‌రెడ్డి, అదీప్‌రెడ్డి  ఉలుకూపలుకూ లేకుండా పడివున్నారు.

బహ్మారెడ్డి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తెల్లవారకముందే బయటకు వెళ్లిపోవడంతో బంధువులు అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్‌ సీఐ దిలీప్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను విచారించారు.  మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మారెడ్డి కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top