కర్నూలులో దొంగలు పడ్డారు!

thieves robbers four houses in one night - Sakshi

నాలుగిళ్లలో  35 తులాల బంగారు నగలు

రూ.2.2 లక్షల నగదు అపహరణ

కర్నూలు : నగరంలోని పలుచోట్ల  బుధవారం దొంగలు పట్టపగలే చోరీకి తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. వెంకటరమణ కాలనీలోని కేఎన్‌ఆర్‌ స్కూల్‌ సమీపంలో ఉన్న ఎం.ఎస్‌–9 అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో ఎస్‌బీఐ(కర్నూలు మెయిన్‌ బ్రాంచ్‌) డిప్యూటీ మేనేజర్‌ సుగుణమ్మ తల్లితో కలసి నివాసముంటున్నారు. కుమార్తె శ్రావణి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఉదయం కుమార్తె బెంగళూరు, తల్లి కడపకు వెళ్లిపోవడంతో  ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలను పెకలించి పడక గదిలో ఉన్న రెండు బీరువాలను బద్దలుకొట్టి అందులో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు సుగుణమ్మ ఇంటికి వెళ్లేసరికి తాళాలు తెరిచి ఉండడంతో లోపలకు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించింది.    రెండో పట్టణ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. 

బాలాజీ నగర్‌లో..
బాలాజీ నగర్‌లోని నాగసాయి అపార్ట్‌మెంట్‌లో రెండిళ్లలో చోరీ జరిగింది. రిటైర్డ్‌ లెక్చరర్‌ గోవిందరాజులు పత్తికొండకు వెళ్లాడు. ఎమ్మిగనూరులో లెక్చరర్‌గా పని చేస్తున్న ఆయన భార్య విజయలక్ష్మి  ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లింది. గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి ప్రవేశించి 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అదే అపార్ట్‌మెంట్‌లో చెన్నారెడ్డి ఇంటిలో చోరీకి విఫల యత్నం చేశారు. కర్నూలు డీఎస్పీ ఖాదర్‌ బాషా, రెండో పట్టణ సీఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐ మోహన్‌కిశోర్‌రెడ్డి, నాలుగో పట్టణ సీఐ రామయ్య నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్స్‌ నిపుణులను పిలిపించి  ఆధారాలను సేకరించారు.  

తుంగభద్ర అపార్ట్‌మెంట్‌లో ..
సుంకేసుల రోడ్డులోని గాంధీ టవర్స్‌కు ఎదురుగా  తుంగభద్ర అపార్ట్టమెంట్‌లోని రెండు ఇళ్లలో చోరీ జరిగింది. ఫ్లాట్‌ నంబర్‌ 501లో శ్రీనివాసరెడ్డి నివాసముంటాడు. ఈయన రాజ్‌విహార్‌ సెంటర్‌లో హోటల్‌ నడుపుతున్నాడు. బుధవారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హోటల్‌కు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ. 2 లక్షల నగదు, 10 తులాల బంగారు చోరీ చేశారు. అలాగే అదే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ నంబర్‌ 503లో వ్యాపారీ వెంకటేశ్వరరెడ్డి నివాసముంటున్నాడు. ఆయన.. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో మహానందికి వెళ్లాడు. దొంగలు ఇంట్లో దూరి భారీగా చోరీ చేశారు. అయితే ఎంత పోయిందనేది బాధితులు మహానంది నుంచి తిరిగివచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. చోరీ విషయం తెలిసిన వెంటనే టూ టౌన్‌ సీఐ డేగల ప్రభాకర్‌ సంఘటన స్థలానికి చేరుకుని నేరం జరిగిన తీరును పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top