చిక్కరు.. దొరకరు! | theft gang halchal in mahabubnagar district | Sakshi
Sakshi News home page

చిక్కరు.. దొరకరు!

Jan 7 2018 11:18 AM | Updated on Oct 8 2018 5:07 PM

theft gang halchal in mahabubnagar district - Sakshi

సాక్షి, వనపర్తి : వరుస దొంగతనాలు అటు పోలీసులను.. ఇటు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పోలీసులను సవాల్‌ విసురుతున్న దొంగలకు పగలూ, రాత్రి చోరీలకు పాల్పడుతూ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తూ చిన్న ఆధారం కూడా లభించకుండా పక్కాప్లాన్‌తో ఉడాయిస్తున్నారు. ఒక్కసారి స్కెచ్‌వేస్తే కనీసం నాలుగు ఇళ్లతో ప్రారంభించి ఎనిమిది ఇళ్ల వరకు లూటీ చేస్తున్నారు. 

ఇప్పటి వరకు జరిగిన వరుస చోరీలన్నీ ఒకే ముఠా సభ్యులు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పైగా పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి పట్టణాల్లో జరిగిన చోరీల్లో ఒకే రకమైన వేలిముద్రలు లభించినట్లు క్లూస్‌ టీం తనిఖీల్లో వెలుగుచశాయి. ఇప్పటివరకు పెబ్బేరు, కోత్తకోట, వనపర్తి పట్టణాల్లో జరిగిన దొంగతనాలన్ని తాళం వేసిన ఇళ్లను పగలు రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో పక్కా స్కెచ్‌తో చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 

దొంగతనాలు నిర్వహించే ముందు చీపుర్లు, బండలు తుడిచే వస్తువులు అమ్మడం, పాతపేపర్లు, పాత ఇనుప సామాన్లు కొంటామంటూ వీధుల్లో తిరుగుతూ రెక్కి నిర్వహిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పగలు తాళం వేసిన ఇళ్లను పక్కాగా గుర్తించి రాత్రి వేళల్లో ఎలాంటి సందడి లేకుండా సులభంగా తాళాలు పగులగొట్టి విలువైన బంగారు, వెండి అభరణాలు, నగదును దోచుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దొంగతనాల్లో దొంగలు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.  

జిల్లాలో వరుస దొంగతనాలు పోలీసులకు తలనొప్పిగా మారితే ఇటు ప్రజలకు ఆందోళనలో నెట్టేశాయి. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నా దొంగతనాల కేసులు మాత్రం పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 15 రోజుల వ్యవధిలోనే వరుసగా మూడు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో చోరీలు చేశారు. కేసుల దర్యాప్తు కొనసాగుతుండగానే మళ్లీ చోరీలు జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

ఈ వరుస దొంగతనాల కేసులపై ప్రజల నుంచి విమర్శలు అధికమవుతుండడంతో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన అన్ని దొంగతనాల్లో దొంగలు, ఇళ్లు, బీరువాల తాళాలను తెరిచిన తీరు, ఇతర ఆధారాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే శనివారం సాయంత్రానికి కాస్తా పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది. దొంగ తనం జరిగిన సంఘటనలో లభించిన వేలిముద్రల ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. వీరంతా పాత నేరస్తులు కావడంతో వారి క్లూస్‌ టీం సేకరించిన వేలిముద్రలలో శివ అలియాస్‌ జబ్బార్‌ వేలిముద్రలు సరిపోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

ఈ ముఠాలో ఒకరిని వనపర్తి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు కూడా సమాచారం. పట్టుబడ్డ నిందితుని సాయంతో మిగిలిన సభ్యుల కోసం గాలించగా గోవా సమీపంలో వారి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ గుర్తించినట్లు తెలిసింది. ఇటీవల వరుస దొంగతనాల్లో దోచుకున్న డబ్బులతో మిగిలిన సభ్యులు జల్సా చేసేందుకు గోవా, తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు అర్థమవుతోంది. ముఠా సభ్యులందరు 30 ఏళ్లలోపు ఉన్న వారేనని తెలుస్తోంది.  జిల్లాలో డిసెంబర్‌ 23న పెబ్బేరు మండల కేంద్రంలో జరిగిన దొంగతనంలో రూ.1.50 లక్షల నగదు, 20 తులాల వెండి, ఒక బైక్‌ చోరికి గురైంది. అలాగే కొత్తకోట మండల కేంద్రంలో ఈనెల 2న 8 తులాల బంగారం, 50 వేల నగదును ఎత్తుకెళ్లారు. తాజాగా ఈనెల 5వ తేదీన వనపర్తి పట్టణంలో జరిగిన దొంగతనంలో 27 తులాల బంగారం, 38 తులాల వెండి, 65 వేల నగదు చోరికి గురైంది.

అనుమానితుల ఫొటోలు విడుదల
జిల్లాలో విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా భావిస్తున్న ముగ్గురు పాత దొంగల ఫొటోలను వనపర్తి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఖలీల్‌ (29), శివ అలియాస్‌ జబ్బార్‌ (27), మహ్మద్‌ సర్వర్‌ (29) ఫొటోలను విడుదల చేశారు. ఈ ముగ్గురు హైదరాబాద్‌ కేంద్రంగా ఉంటూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. 

ప్రస్తుతం వనపర్తి జిల్లాలో జరిగిన వరుస దొంగతనాల కేసుల్లో శివ అలియాస్‌ జబ్బార్‌ వేలిముద్రలు పాత రికార్డుల ప్రకారం సరిపోయాయి. దీంతో ఈ పాత దొంగలే వనపర్తి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసుల అనునమానం. ఈ ముగ్గురు జిల్లాలో ఎక్కడ కనబడినా వెంటనే పోలీస్‌ కంట్రోల్‌  రూం 08545–233331, సీఐలు 94407 95721, 94407 95726, 94407 95737 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జిల్లా ప్రజలను కోరారు. 
ప్రజల సహకారం అవసరం  
పగలైనా, రాత్రయినా అనుమానితులు కనిపిస్తే వెంట నే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రజల సహకా రంతోనే దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుంది.              
                                                                                                                                                                – నాగశేఖరరెడ్డి, ఎస్‌ఐ, వనపర్తి     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement