దసరాపై ఉగ్రనీడ | Terrorist Threat on Mysore Dasara Celebrations | Sakshi
Sakshi News home page

దసరాపై ఉగ్రనీడ

Oct 7 2019 7:44 AM | Updated on Oct 7 2019 7:44 AM

Terrorist Threat on Mysore Dasara Celebrations - Sakshi

సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది. మైసూరు దసరా ఉత్సవాలపై పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు కన్నేసినట్లు సమాచారం. మైసూరు పక్కనే ఉన్న శ్రీరంగపట్టణ సమీపంలో శాటిలైట్‌ ఫోన్‌ వినియోగిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదివారం కిక్కేరి సమీపంలో శాటిలైట్‌ ఫోన్‌ ఉపయోగించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అలాగే హొళెనరసీపుర తాలుకా నుంచి తూర్పు ముఖంగా 15 కిలోమీటర్ల పరిధిలో శ్యాటిలైట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీ చేసి శ్రీరంగపట్టణ సమీపంలో నలుగురిని అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. శాటిలైట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వారంరోజులుగా వదంతులు  
భద్రతా బలగాలు, పోలీసులు తప్ప ఇతరులు శాటిలైట్‌ ఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతి లేదు. విదేశాల్లో ఉన్నవారితో రహస్యంగా సం భాషించడానికి ఉగ్రవాదులు శాటిలైట్‌ ఫోన్లనే ఉపయోగిస్తుంటారు. మైసూరుతో పాటు మండ్య, హాసన్, చామరాజనగర జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. శాటిలైట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నట్లు గత వారం రోజులుగా ప్రచారం సాగుతోంది. వారు ఉగ్రవాదులా, కాదా అనేది తేలాల్సి ఉంది. విదేశాల్లో శాటిలైట్‌ ఫోన్లకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో విదేశీయులు ఇక్కడికి వచ్చి వినియోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే కరావళి ప్రాంతంలో భద్రతను పెంచినట్లు హోంమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. ఉగ్రవాద భయాల నేపథ్యంలో మైసూరు నగరంలోను, ప్యాలెస్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్యాలెస్‌ ఆవరణలోకి పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తారు. బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను విచారిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement