
సాక్షి, గుంటూరు: తమ పార్టీయే అధికారంలో ఉందని అహంకారమో లేక తమను ఎవరేం చేస్తారనే ధీమానో తెలియదు కానీ టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే అమాయక ప్రజలు, కాంట్రాక్టు, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలిపురిలో తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ తుపాకీతో హల్‌చల్ చేశారు.
విద్యుత్ మీటర్ రీడింగ్ తీసేందుకు వచ్చిన యువకుడిపై బెదిరింపులకు దిగారు బాలకృష్ణ. విద్యుత్ మీటర్ బాక్స్‌ను ఇంటి బయట బిగించమన్న యువకుడితో మొదట వాగ్వాదానికి దిగిన బాలకృష్ణ.. ఆపై తుపాకీ గురిపెట్టి ఆ యువకుడిని బెదిరించారు. దీంతో ఒక్కసారి విస్మయానికి గురయినా ఆ యువకుడు పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేయగా సెల్‌ఫోన్ లాక్కొన్ని పగలగొట్టారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.