హత్యచేసి..అమాయకుడిలా...

Sujatha Murder Case Reveals In Visakhapatnam - Sakshi

హత్య తర్వాత మృతురాలి  అక్కతో సతీష్‌ కల్లబొల్లి కబుర్లు

రెండు మూడు నెలల్లో సుజాత వచ్చేస్తుందని నమ్మించే యత్నం

పోలీసులకు దొరికిన హంతకుడు సతీష్‌ వాయిస్‌ కాల్‌ రికార్డింగ్‌

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ప్రియుడి చేతిలో మోసపోయి దారుణంగా హత్యకు గురైన సుజాత కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆధారాలు లేకుండా చేశాను కదా... తనతోపాటు మృతురాలి ఆచూకీ కూడా తెలియని భావించి గోపాలపట్నం పెట్రోల్‌ బంకు జంక్షన్‌ సమీపంలోని తన ఫొటో స్టుడియోలో ఉంటూనే  హంతకుడు రాయపురెడ్డి సతీష్‌ పోలీసుల దర్యాప్తుని గమనించాడు. మరోవైపు సుజాతను నమ్మించి దారుణంగా హతమార్చిన తర్వాత కూడా తనకేం తెలియనట్లు మృతురాలి అక్కతో కబుర్లు చెప్పడం విశేషం. హత్య జరిగిన వారం రోజుల తర్వాత... వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో సుజాత కనిపించడం లేదని... నీ దగ్గరుందా... అని సతీష్‌కి సుజాత సోదరి అరుణ ఫోన్‌ చేసింది. దీంతో సతీష్‌ నీళ్లు నమిలాడు. తనకూ కొద్ది రోజులుగా సుజాత కనిపించడం లేదు..  ఎక్కడుందో ఏంటో.. రెండుమూడు నెలల్లో వచ్చేస్తుంది లెండి..  అంటూ నమ్మించేందుకు యత్నించాడు.

అంటే ఆమె ఎక్కడుందో నీకు తెలుసన్నమాట అని అరుణ ప్రశ్నించే సరికి అయ్యో.. నన్నే అనుమానించేలా ఉన్నారేంటి.. నా సంగతి మీకు తెలీదా.. మీకు సుజాత కనిపించలేనందుకు 90శాతం టెన్షన్‌ ఉంటే నాకు వంద శాతం ఉంది.. చచ్చిపోదామన్నంత టెన్షన్‌ అనుభవిస్తున్నా.. నరకం అనుభవిస్తున్నా... నాకు వైజాగ్‌లో, హైదరాబాద్‌లో స్నేహితులున్నారు.. నాకు సుజాతకు ఇలా సంబంధం ఉందని కాకుండా ఫలానా ఆమె కనిపించలేదని అందరికీ వాకబు చేస్తున్నా.. నా ప్రయత్నంలో నేనున్నా.. ఇంకా చెప్పాలంటే సుజాత కనిపించక, ఊళ్లో నన్ను చూసి ఏమైందిరా.. అంటూ అడగడం, నేను తలెత్తుకోలేక చావాలని ప్రయత్నిస్తే మా నాన్న రక్షించడంతో బతికాను.. అని కథ అల్లాడు. సుజాత హ్యాపీగా ఉంటే చాలు నేను కళ్లు మూసుకుని పడుకుంటాను.. నా పరిస్థితి నది మధ్యలో చిక్కుకున్న నావలా ఉంది.. మీరు సుజాత కోసం ఎలా అనుకుంటున్నారో గానీ ఆమేమీ పిరికిది కాదు... మీకేమైనా సమాచారం తెలిస్తే నాకు తెలియజేయండి... నాకు తెలిస్తే మీకు ఫోన్‌ చేస్తా... అంటూ హంతకుడు సతీష్‌ ఫోన్‌ సంభాషణ సాగించడం గమనార్హం. ఈ ఫోన్‌ సంభాషణను మృతురాలి సోదరి అరుణ పెందుర్తి పోలీసులకు అందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top