హడ్కోకాలనీలో స్ట్రీట్‌ఫైట్‌

Streetfight in Hudco Colony - Sakshi

ఈవ్‌టీజింగ్‌ పేరిట కాలనీలో తగాదా

బలగ జంక్షన్‌ వద్ద ఉద్రిక్తత

గంట సేపు ట్రాఫిక్‌జామ్‌

శ్రీకాకుళం రూరల్‌ : సమయం రాత్రి 7.15 నిమిషాలు...కాలనీ వాసులంతా తమతమ ఇళ్లముందు కాస్తా సేదతీరుతున్నారు. మరికొంతమంది టీవీలు చూస్తున్నారు. ఇంతలో కొంతమంది ఆటోలపై, మరికొంతమంది బైక్‌లపైన వచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా రోడ్డుపై ఉన్న సామాన్లు తన్నుకుంటూ పోయారు. దొరి కిన వారిని పిడుగుద్దులతో గుద్దడం, కర్రలతో కొట్టడం...వీధుల్లో పరుగులు పెట్టించడం అంతా ఓ స్ట్రిట్‌ఫైట్‌ను తలపించిం ది. ఈ వ్యవహారమంతా ఎక్కడో కాదు.. నగర పరిధిలోని స్థానిక హడ్కోకాలనీలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.   

అసలేం జరిగిందంటే..

నగరపరిధిలోని హడ్కోకాలనీ మున్సిపల్‌ స్కూల్‌ వద్ద అదే కాలనీకి చెందిన  అమ్మాయిలను రెల్లివీధికి చెందిన కొంతమంది కుర్రకారు ప్రతినిత్యం ఈవ్‌టీజింగ్‌ చేయడం జరుగుతుంది. ఈ విషయంపై పలుదఫాలుగా పోలీసులకు చెప్పినా  పట్టించుకునే దాఖలాలు మాత్రం కనిపించలేదు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో రెల్లివీధికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం సేవించి హడ్కోకాలనీకి  చెందిన ఓ అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు.

దీన్ని గమనించిన ఆకాలనీ యువత కలుగజేసుకుని వివరాలు తెలుసుకున్నారు. తమ కాలనీ అమ్మాయిలకు ర్యాగింగ్‌ చేయడం సరికాదంటూ సర్దిచెప్పి అక్కడ నుంచి పంపేశారు.  సాయంత్రం మరో ఆరుగురు రెండు బైక్‌లపై వచ్చి కాలనీ వాసులతో మాటామాటా పెంచుకొని తగాదా పడి వెళ్లిపోయారు. ఈలోగా ఆర్‌.కె.నగర్‌కు చెందిన హేమసుందర్‌ అనే వ్యక్తి అటువైపుగా వస్తుండుగా రెల్లివీధికి చెందిన కొంతమంది వ్యక్తులు అడ్డగించి పిడుగుద్దలు గుద్దుతూ అక్కడ నుంచి పారిపోయారు.

అప్పటికే జరిగిన సంఘటనపై కాలనీ వాసులు డైల్‌ 100కు, టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కానిస్టేబుల్‌ వచ్చి సర్దిచెప్పినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా రాత్రి 7.30 సమయంలో రెల్లివీధికి చెందిన సుమారు 40 మంది ఆటోలు, బైక్‌లపై వచ్చి కాలనీలోని మహిళలు, యువత, చిన్నారులపై సైతం ఇష్టానుసారంగా కర్రలతో దాడిచేసినట్లు తెలిసింది. ఈ దాడిలో దుర్గా, కృష్ణ, బిందుసాగర్‌లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. 

రోడ్డుపై బైఠాయింపు

విషయం తీవ్రతరం కావడంతో కాలనీ వాసులంతా మాకుమ్మడిగా బలగ జంక్షన్‌ వద్ద రాస్తారాకో చేపట్టారు. రెండువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకూ ఆందోళన విరమించేదిలేదని హడ్కోకాలనీ వాసులంతా రోడ్డుపైనే సుమారు గంటవరకూ నినాదాలు తీశారు. పరిస్థితి కాస్తా ఉద్రిక్తతకు దారితీయడంతో విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమీక్షించినా బాధితులెవ్వరూ వినిపించుకోలేదు. దీంతో సంఘటన స్థలంలోనే కాలనీకు చెందిన మహిళలు సీఐకు ఫిర్యాదు రాసి ఇచ్చారు. అనంతరం ట్రాఫిక్‌ను దారి  మళ్లించారు. 

ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఆంబులెన్స్‌

ఆసుపత్రి ప్రధాన మార్గం గుండా వెళ్లే ఆంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఓ పేషేంట్‌ను అత్యవసర విభాగానికి తరలిస్తుంది. ఎంత హరన్‌ కొట్టినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో కొంతమంది వ్యక్తులు కలుగుజేసుకుని ఆ అంబులెన్స్‌కు వేరే దారిగుండా ఆస్పత్రికి దారిచూపించారు.  బాధితుడు కల్లేపల్లి బిందుసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవి, కూర్మా రావు, సత్తిబాబు, రాజు, నారాయణ, జ్యోతిలపై టూ టౌన్‌ సీఐ తిరుపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మా కాలనీలో ఈవ్‌టీజింగ్‌ ఎక్కువ

మా కాలనీలోని మున్సిపల్‌ స్కూల్‌ వద్ద ప్రతీనిత్యం ఈవ్‌టీజింగ్‌ జరుగుతుంది. స్కూల్‌ ఉన్నప్పుడైతే ఈ ప్రాంతంలో ఈవ్‌టీజింగ్‌ జరగడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం స్కూల్‌కి సెలవులైనప్పటికీ కాలనీకి చెందిన అమ్మాయిలపై రెల్లివీధికి చెందిన ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌ చేస్తున్నారు.  పోలీసులకు ఫిర్యాదులు చేసినా మాకు న్యాయం జరగలేదు.           – బద్రినాథ్‌ (హడ్కోకాలనీ) 

మాకుమ్మడిగా దాడిచేశారు

నాతో పాటు మా కాలనీ వాసులపై రెల్లివీధికి చెందిన కొంతమంది వ్యక్తులు మాకుమ్మడిగా దాడిచేశారు. ఓ అమ్మాయికి ఈవ్‌టీజింగ్‌ చేయడంతో నేను వెళ్లి వారికి అడిగాను. ఆ తగాదా సాయంత్రమే పెద్దల సమక్షంలో సద్గుమణింది. దాన్ని మనుసులో పెట్టుకుని ఆకతాయిలు మాపై కర్రలతో వెంటాడి కొట్టారు.      

  కె.బిందుసాగర్‌ (హడ్కోకాలనీ) 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top