8 ఏళ్ల చిన్నారిపై మారు తండ్రి లైంగిక దాడి | Step father molestation on an 8-year-old baby | Sakshi
Sakshi News home page

8 ఏళ్ల చిన్నారిపై మారు తండ్రి లైంగిక దాడి

Jun 13 2018 3:11 AM | Updated on Jul 23 2018 8:51 PM

Step father molestation on an 8-year-old baby - Sakshi

సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కాలనీ వాసులతో మాట్లాడుతున్న డీఎస్పీ గంగాధరం (ఇన్‌సెట్‌లో) నిందితుడు లక్ష్మయ్య

కాకుమాను(ప్రత్తిపాడు): ఎనిమిదేళ్ల చిన్నారిపై మారు తండ్రి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా కాకుమాను ఎస్టీ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాపట్ల డీఎస్పీ గంగాధరం తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఐదేళ్ల క్రితం మృతిచెందటంతో భార్య కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మదవర్తి గ్రామానికి చెందిన కొమరనేని లక్ష్మయ్య (35) తన భార్యకు దూరంగా ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం లక్ష్మయ్యకు, సదరు మహిళకు మధ్య పరిచయం ఏర్పడటంతో కొంతకాలం సహజీవనం సాగించి, రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఏడాది క్రితం లక్ష్మయ్య, భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలతో పనుల నిమిత్తం ఒడిశాకు వెళ్లారు. ఇటీవలే తిరిగి వచ్చిన వీరు లక్ష్మయ్య తల్లి కాకుమానులో ఉండటంతో వారం క్రితం అక్కడికి వచ్చారు. మద్యానికి బానిసైన లక్ష్మయ్య తాగిన మత్తులో.. సోమవారం సాయంత్రం ఇంటి పక్కన స్నేహితులతో ఆడుకొంటున్న భార్య చిన్న కూతురు (8)ను పాడుబడ్డ పూరింట్లోకి తీసుకొళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

చిన్నారి భయాందోళనలతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు గమనించి లక్ష్మయ్యను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించి, వారికి అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ గంగాధరం వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని బాపట్ల వైద్యశాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. కాగా, ఇదే చిన్నారిపై లక్ష్మయ్య గతంలోనూ ఒడిశాలో లైంగిక దాడికి పాల్పడినట్లు చిన్నారి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement