breaking news
Bapatla hospital
-
బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కాం!
సాక్షి, గుంటూరు: బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కామ్ బయటపడింది. దాదాపు రూ. 52 లక్షల నిధులను ఆసుపత్రి సూపరింటెండ్ ఆశీర్వాదం స్వాహా చేసినట్టు ఆడిట్లో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆశీర్వాదంతో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. దీంతో ఈ ముగ్గురిపై ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్ కేసు పెట్టారు. కాగా, ఆశీర్వాదం ఇటీవలే బదిలీపై వైజాగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. -
8 ఏళ్ల చిన్నారిపై మారు తండ్రి లైంగిక దాడి
కాకుమాను(ప్రత్తిపాడు): ఎనిమిదేళ్ల చిన్నారిపై మారు తండ్రి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా కాకుమాను ఎస్టీ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాపట్ల డీఎస్పీ గంగాధరం తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఐదేళ్ల క్రితం మృతిచెందటంతో భార్య కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మదవర్తి గ్రామానికి చెందిన కొమరనేని లక్ష్మయ్య (35) తన భార్యకు దూరంగా ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం లక్ష్మయ్యకు, సదరు మహిళకు మధ్య పరిచయం ఏర్పడటంతో కొంతకాలం సహజీవనం సాగించి, రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఏడాది క్రితం లక్ష్మయ్య, భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలతో పనుల నిమిత్తం ఒడిశాకు వెళ్లారు. ఇటీవలే తిరిగి వచ్చిన వీరు లక్ష్మయ్య తల్లి కాకుమానులో ఉండటంతో వారం క్రితం అక్కడికి వచ్చారు. మద్యానికి బానిసైన లక్ష్మయ్య తాగిన మత్తులో.. సోమవారం సాయంత్రం ఇంటి పక్కన స్నేహితులతో ఆడుకొంటున్న భార్య చిన్న కూతురు (8)ను పాడుబడ్డ పూరింట్లోకి తీసుకొళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి భయాందోళనలతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు గమనించి లక్ష్మయ్యను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించి, వారికి అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ గంగాధరం వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని బాపట్ల వైద్యశాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. కాగా, ఇదే చిన్నారిపై లక్ష్మయ్య గతంలోనూ ఒడిశాలో లైంగిక దాడికి పాల్పడినట్లు చిన్నారి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. -
నా రక్తం ఇస్తా.. ఆపరేషన్ చేయండి
*వైద్యులతో ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల: ‘సార్.. నాకు ఆపరేషన్ చేయరంట.. నన్ను గుంటూరు వెళ్లమంటున్నారు’ అంటూ ఓ గర్భిణి బాపట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎదుట బోరుమంది. గణపవరానికి చెందిన గర్భిణి అన్నామణి మంగళవారం బాపట్ల ఆస్పత్రికి చేరుకుని ఆపరేషన్ చేసి తనను, బిడ్డను కాపాడాలని కోరింది. బీ పాజిటివ్ బ్లడ్ లేకపోవటంతో గుంటూరు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆ సమయంలో ఆస్పత్రిలో అభివృద్ధి పనులు పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి అన్నామణి తన బాధను తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన ‘నాది బీ పాజిటివ్ బ్లడ్.. నా బ్లడ్ తీసుకుని ఆపరేషన్ ప్రారంభించండి’ అని ముందుకొచ్చారు. చివరకు ఎమ్మెల్యే చొరవతో గుంటూరులోని బ్లడ్‌బ్యాంకు నుంచి అదే గ్రూపు రక్తం తెప్పించి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు.