మామూళ్ల వసూలు వ్యవహారంపై ఎస్పీ కొరడా

SP Acts Against Corrupt Police Officers - Sakshi

తాజాగా ఎస్సైతో పాటు  18 మంది పోలీసులపై చర్యలు

ఏఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఎస్పీ ఆదేశాలు

కింది స్థాయి అధికారులు, సిబ్బందిలో ఆందోళన

మామూళ్ల వసూలు వ్యవహారంపై ఎస్పీ కొరడా ఝళిపించారు. ఇప్పటికే 16 మంది పోలీసులు, ఇద్దరు ఎస్సైలను ఏఆర్‌కు అటాచ్‌ చేసిన ఎస్పీ.. తాజాగా మరో ఎస్సైతో పాటు 18 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరిని ఏఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.   

సాక్షి, కామారెడ్డి: వసూళ్లకు పాల్పడుతున్నారం టూ రాష్ట్ర పోలీసు అధికారులు ఇటీవల ప్రకటించి న జాబితాలో జిల్లాకు చెందిన 16 మంది పోలీసు ల పేర్లు ఉన్నాయి. డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ ఈనెల మొదటి వారంలో వారిని ఏఆర్‌కు అటాచ్‌ చేశారు. తరువాత క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇతర పోలీస్‌ స్టేషన్లకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కానిస్టేబుళ్లపై చర్యల అనంతరం వసూళ్ల వ్యవహారంలో ఇద్దరు ఎస్సైలపైనా చర్యలు తీసు కున్నారు.

దీంతో పోలీసు శాఖలో కలవరం మొదలైంది. ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని భయపడుతున్నారు. తాజాగా ఎస్సైని, 18 మంది పోలీసు సిబ్బందిని ఏఆర్‌కు అటాచ్‌ చేశారు. వీరి లో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 13 మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉన్నా రు. దీంతో జిల్లాలో చర్యలకు గురైన పోలీస్‌ అధి కారులు, సిబ్బంది సంఖ్య 37 కు చేరింది.  

అధికారుల్లోనూ వణుకు.. 

మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై జిల్లా అధికారులు సీరియస్‌గా వ్యవహరిస్తుండడంతో కింది స్థాయి పోలీసు అధికారుల్లోనూ వణు కు మొదలైంది. చాలా కాలంగా పొలిటికల్‌ అండ తో ఇష్టారీతిన వ్యవహరించిన అధికారులు సైతం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ పెద్దల అనుమతితోనే పోలీస్‌ ఉన్నతాధికారులు వసూల్‌ రాజాలపై చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో రాజకీయ నాయకులను ఆశ్రయించినా లాభం లేదని కొందరు అధికారులు భావిస్తున్నారు. జిల్లా స్థాయి పోలీసు అధికారులు ఒప్పుకోకున్నా పొలిటికల్‌ పలుకుబడితో పోస్టింగులు తెచ్చుకున్నవారు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ తమపైనా చర్యలకు దిగుతారోనని వణికిపోతున్నారు.   

అధికారులపైనా ఆగ్రహం..

మామూళ్ల వసూళ్ల వ్యవహారంపై ఎస్పీ శ్వేత సీరియస్‌గా ఉన్నారు. ఆమె ఈ విషయమై ఇటీవల సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వసూళ్లు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించినట్టు సమాచారం. కాగా జిల్లాలో పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకున్న విషయమై ఎస్పీ శ్వేతను ‘సాక్షి’ సంప్రదించగా.. ఎస్సైతో పాటు 18 మంది సిబ్బందిని ఏఆర్‌కు అటాచ్‌ చేసినట్టు తెలిపారు.

ప్రజలతో స్నేహపూర్వకంగా మెదలాలని చెబుతున్నామని, అయినా కొందరు పదేపదే తప్పులు చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం పోలీసు శాఖకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, నిధులు అందిస్తోందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది నిజాయితీగా విధులు నిర్వహించడం ద్వారా ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top