చేతబడి నెపంతో తల్లిని చంపిన తనయుడు..! | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 25 2018 11:19 AM

Son Murdered Mother Due To Black Magic Allegations - Sakshi

సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): నవమోసాలు మోసి కని పెంచిన తల్లిని తనయుడే హతమార్చిన సంఘటన బోయినపల్లి మండలం విలాసాగర్‌ గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన జంగపెల్లి చంద్రవ్వ(60) అనే మహిళను ఆమె కుమారుడు జంగపెల్లి శ్రీనివాస్‌ ఆదివారం రాత్రి గొంతు నులిమి చంపిన ఘటన మండలంలో సంచలనం రేకెత్తించింది. ఎస్సై పాకాల లక్ష్మారెడ్డితో పాటు గ్రామస్తుల కథనం ప్రకారం..

జంగపెల్లి చంద్రవ్వ–నర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వీరికి గతంలోనే వివాహాలు జరిగాయి. కుమారుడు శ్రీనివాస్‌ జీవనోపాధి కోసం కువైట్‌ వెళ్లి నాలుగు నెలల క్రితం వచ్చాడు. ఇంట్లో ఉంటే ఆరోగ్యం బాగుండడం లేదని గంగాధరలో భార్య కుమారుడితో కలిసి కాపురం పెట్టాడు. తన తల్లి చంద్రవ్వ మంత్రాలు చేయడంతోనే తన ఆరోగ్యం బాగుండడం లేదని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో విరుగుడు పూజలు సైతం చేయించాడు. ఆదివారం విలాసాగర్‌లోని తమ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తండ్రి నర్సయ్య తన కూతురు ఇంటికి వెళ్లాడు.

ఈ క్రమంలో శ్రీనివాస్‌ రాత్రి నిదురిస్తున్న తల్లిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బల్ల పై నుంచి కింద పడి మృతి చెందిందని తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. కుటుంబసభ్యులు అనుమానంతో నిలదీయడంతో చివరకు తానే ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. మంత్రాలు చేస్తుందనే అనుమానంతో తన భార్య చంద్రవ్వను కుమారుడు శ్రీనివాస్‌ గొంతునులిమి హత్య చేశాడని నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని వేములవాడ రూరల్‌ సీఐ డీ.రఘుచందర్‌ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నాడు. 

నిందితుడి అరెస్ట్‌
విలాసాగర్‌ గ్రామంలో మంత్రాల నెపంతో తల్లి జంగపెల్లి చంద్రవ్వను గొంతు నులిమి చంపిన కేసులో కుమారుడు జంగపెల్లి శ్రీనివాస్‌ను సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు వేములవాడరూరల్‌ సీఐ రఘుచందర్‌ తెలిపారు. మంత్రాలు చేస్తుందనే దురాలోచనతో తల్లిని శ్రీనివాస్‌ టవల్‌ను గొంతుకు బిగించి హత్య చేసినట్లు సీఐ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement