
నిర్మాత హార్వేతో నటి రోజ్ (పాత ఫొటో)
న్యూయార్క్ : మూవీ మొఘల్‌గా ప్రసిద్ధుడైన నిర్మాత హార్వే వెయిన్‌స్టన్ లైంగిక వేధింపుల వ్యవహారం హాలీవుడ్‌ను తీవ్రంగా కుదిపేస్తోంది. కొద్దిరోజుల కిందట ఓ ఇటాలియన్ మోడల్ ఫిర్యాదుతో మొదటిసారి వెయిన్‌స్టన్ లీలలు వెలుగులోకి రాగా, అతను కామాంధుడేనని, తమపైనా అత్యాచారాలు, వేధింపులకు పాల్పడినట్లు ఇప్పటివరకు 34 మంది హీరోయిన్లు ప్రకటనలు చేశారు. వారిలో ఏంజిలీనా జోలీ, ఎమిలీ నెస్టర్, ఏసియా అర్జెంటో, లూరెన్ ఒకానర్ తదితరులున్నారు.
కాగా, తాజాగా నటి రోజ్ మెక్‌గోవాన్.. వెయిన్‌స్టన్ లీలలపై నోరు విప్పారు. నిర్మాత తనను రేప్ చేశాడని, అతనిపై ఫిర్యాదు చేసినందుకే అమెజాన్ స్టుడియో తన కథనాన్ని ప్రసారం చేయకుండా నిలిపేసిందని రోజ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆమె వరుస ట్వీట్లు చేశారు.
‘‘అప్పుడు(2010లో) నేను(రోజ్) అమెజాన్ స్టుడియో(ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన కంపెనీ) కోసంఒక స్క్రిప్ట్ రాసేపనిలో ఉన్నాను. ఆ టైమ్‌లోనే నిర్మాత హార్వే వెయిన్‌స్టన్ నాపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో అతనిపై స్డుడియో హెడ్.. రాయ్ ప్రైస్‌కు ఫిర్యాదుచేశాను. స్టుడియో హెడ్‌గా నాకు అండగా నిలవాల్సిన రాయ్.. నా మాటల్ని విశ్వసించకపోగా, రేప్ జరిగిందనడానికి ఆధారాలేవి? అని ప్రశ్నించాడు. అప్పుడు నేను ‘రేప్ జరిగింది నాపైనే.. నేనే నాధారాన్ని’ అని గొంతుచించుకుని అరిచా. కానీ వాళ్లు పట్టించుకోలేదు. ఆ తర్వాత నా స్క్రిప్ట్‌ను టీవీ సీరియల్ చేయడం లేదని అమెజాన్ స్టుడియో ప్రకటించింది. చివరికి నాతో ఒప్పందం చేసుకుని, అమెజాన్ ఆ స్క్రిప్టును కొనేసింది. ఆ కథతో ‘మాంచెస్టర్ బై ద సీ’ సినిమా తీసి అమెజాన్ ఆస్కార్ అవార్డు కొట్టేసింది’’ అని రోజ్ మెక్‌గోవాన్ పేర్కొన్నారు.
అమెజాన్ హెడ్‌పై వేటు : అమెజాన్ స్డుడియో హెడ్ రాయ్ ప్రైస్‌పై వేటు వేస్తున్నట్లు అమెజాన్ సంస్థ గురువారం ప్రకటించింది. తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ టీవీ నిర్మాత ఇసా హక్కట్.. రాయ్‌పై ఆరోపించిన కారణంగానే ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే, రోజ్ మెక్‌గోవాన్ ట్వీట్లపై మాత్రం అమెజాన్ స్పందించలేదు.

నిర్మాత హార్వేతో నటి రోజ్ (ఇన్‌సెట్: 1.రోజ్ ట్వీట్, 2.అమెజాన్ స్డుడియో హెడ్ రాయ్‌తో రోజ్)