‘అందుకే అపూర్వ.. రోహిత్‌ను హత్య చేసింది’ | Sakshi
Sakshi News home page

రోహిత్‌ తివారీ హత్యకు గల కారణాలివే!

Published Wed, Apr 24 2019 3:52 PM

Rohit Shekhar Tiwari Murder Case Apoorva Killed Him While He Was Drunk - Sakshi

న్యూఢిల్లీ : వైవాహిక జీవితంలో కలతల కారణంగానే రోహిత్‌ శేఖర్‌ తివారి భార్య అపూర్వ శుక్లా అతడిని హత్య చేసినట్లు ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం, దివంగత నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్‌ శేఖర్‌ తివారి గత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఢిల్లీ పోలీసులు రోహిత్‌ది హత్యేనని నిర్దారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న రోహిత్‌ భార్య అపూర్వను అరెస్ట్‌ చేశారు.  ముఖంపై దిండుతో  ఒత్తి  రోహిత్‌ను హత్య చేశారన్న అభియోగాలపై ఆమెను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ అర్ధరాత్రి ఒంటిగంటకు వారిమధ్య తలెత్తిన గొడవ తీవ్రరూపం దాల్చింది. రోహిత్‌ మద్యం మత్తులో ఉన్న సమయంలో అపూర్వ అతడిని హతమార్చింది. ఈ హత్యలో ఆమెకు ఎవరూ సహకరించలేదు. తనంతట తానే స్వయంగా అతడికి ఊపిరాడకుండా చేసి చంపింది. ఆ తర్వాత ఆధారాలన్నింటినీ మాయం చేసింది. కేవలం గంటన్నర సమయంలో ఆమె ఈ పనులన్నీ పూర్తి చేసింది. త్వరలోనే ఆమెను కోర్టు ముందు హాజరుపరుస్తాం’ అని కేసుకు సంబంధించి విషయాలు వెల్లడించారు.

చదవండి : నా ఇద్దరు కొడుకుల ఆస్తిపై కన్నేసింది : ఎన్డీ తివారి భార్య

కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా రోహిత్‌ పనిమనిషి బోలును కూడా అనేకమార్లు విచారించినట్లు పోలీసులు తెలిపారు. అతడితో పాటు మరో ముగ్గురు పనిమనుషుల వాంగ్మూలం, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసులో పురోగతి సాధించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 15న తాగిన మైకంలో ఇంటికి వచ్చిన రోహిత్‌ తన గదిలోకి వెళ్లి నిద్రపోయినట్లు ఫుటేజీల ఆధారంగా వెల్లడైందని పేర్కొన్నాయి. డిఫెన్స్‌ కాలనీలోని రోహిత్‌ ఇంట్లో మొత్తం ఏడు సీసీటీవీలు ఉన్నాయని, వాటిలో రెండు మాత్రం పనిచేయడం లేదని పేర్కొన్నాయి. హత్యకు ప్లాన్‌ చేసే క్రమంలోనే వాటిని పనిచేయకుండా చేశారా అనే సందేహాలు వ్యక్తం చేశాయి.

చదవండి : అపూర్వను గుడ్డిగా నమ్మాను : ఎన్డీ తివారి భార్య

ఇక రోహిత్‌ మరణానంతరం అతడి తల్లి ఉజ్వల తివారి మాట్లాడుతూ.. రోహిత్‌, తన భార్య అపూర్వ మధ్య అంతగా సఖ్యత లేదని.. పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. రాజీవ్‌ అనే వ్యక్తి భార్యతో.. రోహిత్‌కు అక్రమ సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. ‘ఉత్తరాఖండ్‌ సీఎంగా పనిచేసిన క్రమంలో ఎన్డీ తివారికి చేదోడువాదోడుగా ఉన్న రాజీవ్‌ కొడుకు కార్తిక్‌ రాజ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని నా పెద్ద కుమారుడు సిద్ధార్థ్‌ భావించాడు. ఇందుకు రోహిత్‌ కూడా సుముఖంగానే ఉన్నట్లు అనిపించింది. కానీ అపూర్వ మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు సమీపంలో ఉన్న ఆస్తి తన పేరిట రాయించాలని కోరింది. ఈ విషయమై తరచుగా గొడవలు జరిగేవి. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో రోహిత్‌, అపూర్వ ఈ ఏడాది జూన్‌లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకున్నారు’ అని వెల్లడించారు. ఇక రోహిత్‌, అపూర్వ ఇద్దరూ న్యాయవాదులేనన్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement