కోడలిపై సంచలన ఆరోపణలు చేసిన ఎన్డీ తివారి భార్య

ND Tiwari Wife Accuses Her Daughter In Law Trying To Take Property Over Rohit Murder Case - Sakshi

న్యూఢిల్లీ : ‘నా ఇద్దరు కొడుకులు సిద్ధార్థ్‌, రోహిత్‌ల ఆస్తిపై అపూర్వ, ఆమె కుటుంబ సభ్యులు కన్నేశారు. సుప్రీంకోర్టు సమీపంలో ఉన్న ఇంటిని దక్కించుకోవాలనుకున్నారు’ అంటూ ఎన్డీ తివారి భార్య ఉజ్వల తివారి తన కోడలిపై సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం, దివంగత నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్‌ శేఖర్‌ తివారి గత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఢిల్లీ పోలీసులు రోహిత్‌ది హత్యేననే నిర్దారించారు. ఈ క్రమంలో రోహిత్‌ భార్య అపూర్వ సహా వాళ్లింట్లోని పనిమనుషులను గత రెండు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి దాదాపు ఎనిమిది గంటల పాటు అపూర్వను విచారించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రోహిత్‌ తల్లి ఉజ్వల మాట్లాడుతూ రోహిత్‌, తన భార్య అపూర్వ మధ్య అంతగా సఖ్యత లేదని.. పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. రాజీవ్‌ అనే వ్యక్తి భార్యతో.. రోహిత్‌కు అక్రమ సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. ‘ఉత్తరాఖండ్‌ సీఎంగా పనిచేసిన క్రమంలో ఎన్డీ తివారికి చేదోడువాదోడుగా ఉన్న రాజీవ్‌ కొడుకు కార్తిక్‌ రాజ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని నా పెద్ద కుమారుడు సిద్ధార్థ్‌ భావించాడు. ఇందుకు రోహిత్‌ కూడా సుముఖంగానే ఉన్నట్లు అనిపించింది. కానీ అపూర్వ మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు సమీపంలో ఉన్న ఆస్తి తన పేరిట రాయించాలని కోరింది. ఈ విషయమై తరచుగా గొడవలు జరిగేవి. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో రోహిత్‌, అపూర్వ ఈ ఏడాది జూన్‌లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకున్నారు’ అని ఉజ్వల వెల్లడించారు.

చదవండి : అపూర్వను గుడ్డిగా నమ్మాను : ఎన్డీ తివారి భార్య

కాగా ఉజ్వల తివారికి మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం సిద్ధార్థ్‌. ఇక 2008లో తివారీ తనకు జన్మనిచ్చిన తండ్రి అంటూ ఆమె రెండో కుమారుడు రోహిత్‌ శేఖర్‌ పితృత్వ దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు డీఎన్‌ఏ పరీక్షలకు ఆదేశించగా రోహిత్‌ తివారీ కుమారుడేనని 2012 జులై 27న ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 2014 మార్చి 3న రోహిత్‌ శేఖర్‌ను తివారీ తన కుమారుడిగా అంగీకరించారు. 2014 మే 14న శేఖర్‌ తల్లి ఉజ్వలా తివారీని వివాహం చేసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top