పండుగకు వస్తూ పరలోకాలకు.. | Road Accident In Rajanna Sircilla | Sakshi
Sakshi News home page

పండుగకు వస్తూ పరలోకాలకు..

Nov 7 2018 2:42 AM | Updated on Apr 3 2019 7:53 PM

Road Accident In Rajanna Sircilla - Sakshi

సిరిసిల్లక్రైం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి కంటెయినర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటన మంగళవారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌ కట్టరాంపూర్‌లో నివాసం ఉంటూ గోల్డ్‌స్మిత్‌గా పనిచేసే అనిల్‌(43), భార్య గీత, కుమారులు సూరజ్‌ (17), సృజ న్‌ (15)లతో కలసి సిరిసిల్లకు తన కారులో బయలుదేరారు. అక్కడ తన అత్తగారింట్లో బుధవారం నిర్వహించే దీపావళి వేడుకలకు వారు హాజరు కావాల్సి ఉంది. కారు సిరిసిల్ల బైపాస్‌ రోడ్డు వరకు రాగానే.. సిద్దిపేట నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న కంటెయినర్‌ ఎదురుగా వచ్చింది.

అప్పటికే వేగంగా ఉన్న కారు.. అదుపుతప్పి కంటెయినర్‌ను ఢీకొట్టింది. దీంతోకారు నుజ్జు నుజ్జు అవ్వడంతో డ్రైవింగ్‌ చేస్తున్న అనిల్‌ తీవ్రంగా గాయపడి అందులోనే ప్రాణాలు విడిచాడు. కారు వెనకాల కూర్చున్న భార్య గీత ఎడమవైపు ఉన్న డోరు నుంచి బయటపడి తీవ్ర గాయాలపాలైంది. ఇద్దరు కుమారులు కారులోనే ఇరుక్కుని చనిపోయారు. గీతను స్థానికులు తొలుత సిరిసిల్లలోని ఓ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు.  గమ్యస్థానానికి మరో ఐదు నిమిషాల్లోనే చేరుకునేలోగా ఈ ఘటన జరగడం బంధువుల్లో తీవ్ర విషాదం నింపింది.  ఎస్పీ రాహుల్‌హెగ్డే ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement