రైల్వే ఉద్యోగి అరెస్ట్‌

Railway Employee held in Monthly Money Lucky Draw Cheating Case - Sakshi

మంత్లీ మనీ స్కీం పేరుతో టోకరా

ఎమ్మిగనూరురూరల్‌: మంత్లీ మనీ స్కీం పేరుతో రూ.లక్షల్లో టోకరా పెట్టిన రైల్వే ఉద్యోగిని ఎమ్మిగనూరు పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నిందితుడి వివరాలను స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదోని డీఎస్పీ కేఎస్‌ వినోద్‌కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని వెంకటగిరి గ్రామానికి చెందిన నెమ్మరాళ్ల చిన్న మునెప్ప కుమారుడు ఉరుకుందు ఆదోని రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌మెన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అంతకుముందు కర్నూల్‌లో విధులు నిర్వహించే సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో షేర్‌ మార్కెట్‌లో డబ్బు పెట్టడంతో కాస్త లాభం వచ్చింది. దీంతో అతని ఆశ మరింత పెరిగింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని కొత్త స్కీంకు తెర లేపాడు. తాను పని చేసేరైల్వే సంస్థలోనే మంత్లీ మనీ స్కీం ఉందని, ఈ స్కీంలో డబ్బు పెడితే రూ.100కి నెలకు రూ.5ల చొప్పున వడ్డీ వస్తుందని సొంత బామ్మర్దులకు(భార్య సోదరులు), బంధువులకు నచ్చజెప్పాడు.

ఒకరికి తెలియకుండా మరొకరికి మాయ మాటలు చెప్పి తన ఖాతాకు లక్షల్లో డబ్బు జమ చేయించుకున్నాడు. మొదట మూడు నెలలు రూ.5 చొప్పున వడ్డీ సక్రమంగా ఇవ్వడంతో నమ్మకం కుదిరి బాధితులు అప్పు తెచ్చి మరీ అతని చేతిలో పెట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి వడ్డీ చెల్లించడం మానేశాడు. అడిగినప్పుడల్లా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడంతో గట్టిగా నిలదీశారు. తన వద్ద డబ్బు లేదని, ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో బాధితులు(బామ్మర్దులు) కోట ఉమారాజు, కోట జయరాముడు, కోట వీరాంజనేయులు, కోటా గోపాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన పరందామ గత నెల29న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆదోని రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉరుకుందును అరెస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు తమ విచారణలో రూ.47 లక్షలకు సంబంధించిన బాధితులు తమను కలిశారని, దర్యాప్తు కొనసాగుతుందని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్‌ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ రామసుబ్బయ్య పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top