మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

సత్తుపల్లి: అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయటంతో ఓ యువకుడు మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ ఎం.వెంకటనర్సయ్య కథనం ప్రకారం సత్తుపల్లి పట్టణానికి చెందిన కటికల రాజేష్‌(27) టాటా మోటర్స్‌ ఖమ్మంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మృతుడు రాజేష్‌ సత్తుపల్లికి చెందిన అజయ్‌కుమార్‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తానని రూ.20 వేలు తీసుకున్నాడు. 

సోనాలిక ట్రాక్టర్‌ ట్రాన్స్‌పోర్టు మేనేజర్‌ శివారెడ్డికి ఒక ట్రాక్టర్‌కు సంబంధించిన ఫైనాన్స్‌ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. అదేవిధంగా మోటారు సైకిల్‌ మెకానిక్‌లు అజార్, సుధాకర్‌ల వద్ద రూ.10 వేలు చొప్పున అప్పు తీసుకున్నాడు.  మరో పదిమంది వద్ద రుణాలు ఇప్పిస్తానని అప్పు చేసినట్లు తెలిసింది. సత్తుపల్లి నుంచి ఖమ్మంకు మకాం మార్చాడు. సోమవారం రాజేష్‌ సత్తుపల్లి వచ్చాడని అప్పులు ఇచ్చినవాళ్లు తెలుసుకొని డబ్బులు చెల్లించాలని  పట్టుపట్టడంతో వాగ్వాదం జరిగింది.  
 
100కు ఫోన్‌.. 

మృతుడు తల్లి విమలాదేవి 100కు ఫోన్‌ చేసి మా ఇంటి వద్ద గొడవ జరుగుతుందని చెప్పటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజేష్‌ ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకోవటంతో కంగారుపడిన తల్లి దండ్రులు రాజేష్‌తో మాట్లాడించే ప్రయత్నం చేస్తుండగానే తలుపు తీయకుండా గదిలో  ఫ్యాన్‌కు చీరతో ఉరి బిగించుకుంటున్నాడు. కిటికిలో నుంచి గమనించి రాజేష్‌ను కాపాడేందుకు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లే సరికే అప్పటికే అపస్మారక స్థితికి వెళ్లాడు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళుతుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రాజేష్‌ మృతికి అప్పులు ఇచ్చిన వారు బలవంతం చేయటమే కారణం అంటూ తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top