ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి

Pregnant Women Died With Doctors Negligence - Sakshi

వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువుల ఆందోళన

తిరువొత్తియూరు: కోవైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు గురువారం ఆందోళన చేపట్టారు. వివరాలు.. కోవై శివానందం కాలనీకి చెందిన సురేష్‌కుమార్‌ భార్య నిర్మల (35) కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి కావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంగతి తెలుసుకున్న కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్‌ తాను పార్ట్‌టైంగా పనిచేస్తున్న రామనాథపురంలోని ఎన్‌ఎం ఆస్పత్రిలో చెక్‌అప్‌లకు రమ్మని పిలిచినట్టు తెలిసింది.

ఈ క్రమంలో నిర్మలను ప్రసవం కోసం గత 15వ తేదీ ఆమె చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే గర్భంలో శిశువు మృతి చెందినట్లు తెలిసింది. తరువాత అక్కడ డాక్టర్లు లేక పోవడంతో ఆమెకు శస్త్రచికిత్స చేయనట్టు తెలిసింది. మరుసటి రోజు మంగళవారం డాక్టర్లు నిర్మలకు శస్త్ర చికిత్స చేసి మృతశిశువును బయటకు తీసి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి నిర్వాహకులు నిర్మలను చికిత్స నిమిత్తం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా నిర్మల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నిర్మల బుధవారం రాత్రి మృతి చెందింది.

బంధువుల ఆందోళన
నిర్మల మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు గురువారం ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న రేస్‌కోర్సు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరపించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top