పథకం ప్రకారమే హత్య..

Police Chase Murder Case In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : పట్టణంలోని అయోధ్యా మైదానంలో గ్రౌండ్‌మన్‌గా పనిచేస్తున్న జరజాపు పెంటయ్యను  పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లు టూటౌన్‌ పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పట్టణ డీఎస్పీ  పి. వీరాంజనేయరెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. అయోధ్యా మైదానంలో గ్రౌండ్‌మన్‌గా పనిచేస్తున్న జరజాపు పెంటయ్యకు అక్కడే తాత్కాలిక పద్ధతితో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న డి. ప్రసాద్‌తో పరిచయం ఉంది. ఇద్దరూ ఎప్పటికప్పుడు మద్యం సేవిస్తుంటారు. వీరికి క్రికెట్‌ ట్రైనర్‌ హేమంత్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

ఇదిలా ఉంటే  కొండకరకాంలో ఉన్న తన ఇంటిని పెంటయ్య వేరేవాళ్లకు రూ. 30 వేలకు తనఖా పెట్టాడు. ఈ క్రమంలో వారి అప్పు తీర్చేందుకు కుమారుడు, కుమార్తె ఇచ్చిన 20 వేలు పట్టుకుని ప్రసాద్‌తో కలసి ఆదివారం ఉదయం పెంటయ్య కొండకరకాం వెళ్లాడు. అయితే తనఖా పట్టిన వారు మొత్తం 30 వేల రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టడంతో డబ్బులతో సహా తిరిగి వెనక్కి వచ్చేశారు. జల్సాలకు అలవాటుపడిన ప్రసాద్‌కు ఆ డబ్బును చూడగానే ఎలాగైనా దోచేయాలని దుర్బుద్ధి కలిగింది. దీంతో విషయాన్ని హేమంత్‌కు తెలియజేసి సాయం చేయమని కోరాడు. ఇదే అదునుగా పెంటయ్యను చంపేస్తే ఆ ఉద్యోగం నీకు వస్తుందని.. పైగా చెరో పది వేల రూపాయలు తీసుకోవచ్చని హేమంత్‌ను ప్రసాద్‌ రెచ్చగొట్టాడు. 

మద్యం మత్తులో..
ప్రసాద్, హేమంత్‌ ఇద్దరూ ఆదివారం రాత్రి ఫుల్‌గా మద్యం తాగి అర్ధరాత్రి వరకు మైదానం వద్దే గడిపారు. అనంతరం గదిలో పడుకున్న పెంటయ్య వద్దకు వెళ్లి పిడిగుద్దులు గుద్ది హత్య చేశారు. హత్యను సాధారణ మృతికింద తేల్చేందుకు నిందితులు ఉదయాన్నే  పీడీకి ఫోన్‌ చేసి పెంటయ్య చనిపోయాడని తెలిపారు. ఈలోగా సోమవారం ఉదయం  గ్రౌండ్‌కి వచ్చిన పలువురు క్రీడాకారులు, పెద్దలు పెంటయ్య మృతదేహాన్ని చూసి ఇది సాధారణ మృతికాదని.. హత్యగా అనుమానించి  పోలీసులకు సమాచారమందించారు. దీంతో రంగంలోకి దిగిన టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గదిలో చనిపోయిన వ్యక్తిని బయటకు తీసి గది అంతా నీటితో శుభ్రం చేయడం.. వృద్ధుడి చేతిపైనా, శరీరంపైనా గాయాలు ఉండడంతో హత్యగా అనుమానం వ్యక్తం చేశారు.

ఎస్పీ బి.రాజకుమారి ఆదేశాల మేరకు టౌన్‌ డీఎస్పీ నేతృత్వంలో టూటౌన్‌ సీఐ డి.శ్రీహరిరాజు, ఎస్సై వాసుదేవ్‌లు రాత్రంతా అక్కడే గడిపిన ప్రసాద్, హేమంత్‌లను విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నారు. పెంటయ్యను చంపితే ఆయన చేస్తున్న ఉద్యోగం తనకు వస్తుందనే ఉద్దేశంతో ప్రసాద్‌కు సహకరించినట్లు హేమంత్‌ అంగీకరించాడు. రూ. 20 వేలను చెరో పది వేల రూపాయలు పంచుకున్నామని చెప్పారు. నిందితుల నుంచి నగదు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన సీఐ శ్రీహరిరాజు, ఎస్సై వాసుదేవ్, ఏఎస్సై ఎంవీవీ కృష్ణారావు, హెచ్‌సీలు సీహెచ్‌. వేణునాయుడు, బి.శ్రీనివాస్, పీసీ కె.సత్యం తదితరులను డీఎస్పీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top