చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

Police Attacks On Fake Nutrition food, syrups Manufacturing Centre - Sakshi

డూప్లికేట్‌ సిరప్‌లు,న్యూట్రిషన్‌ ఫుడ్‌ తయారు చేస్తున్న అక్రమార్కులు

వల పన్ని పట్టుకున్న    టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

మలక్‌పేట: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చిన్నపిల్లల న్యూట్రిషన్‌ ఫుడ్, సిరప్‌లు తయారు చేస్తున్న కేంద్రంపై ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల విలువైన న్యూట్రిషన్‌ సిరప్‌లు, కెమికల్స్‌ కలిపిన ద్రావణం, ముడి సరుకులు, యంత్ర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ చైతన్యకుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మూసారంబాగ్‌ డివిజన్, ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ కాలనీలోని ఓ ఇంట్లో అనుమతులు లేకుండా ఆహార పానీయాలు, సిరప్‌లు, న్యూట్రిషన్‌ ఫుడ్‌ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామన్నారు. గాబ మనీశ్‌ అనే వ్యక్తి డైరెక్టర్‌ ఆఫ్‌ హిమాలయ లైఫ్‌లైన్‌ పేరుతో గత 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నకిలీ సిరప్‌లు తయారు చేస్తూ ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

దాదాపు 43 రకాల ఫ్లేవర్స్‌తో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. 2012లో వీటికి లైసెన్స్‌ లీసుకున్నట్లు పత్రాలు ఉన్నా, రెన్యువల్‌ చేయించుకోలేదని, దీనిపై విచారణ చేపడుతామన్నారు. ఈ ఉత్పత్తులపై ఎలాంటి హెచ్చరికలు, సూచనలు లేవని, వీరు తయారు చేస్తున్న సిరప్‌లను తెలిసిన వ్యక్తుల ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తయారీ కేంద్రాన్ని సీజ్‌ చేసి స్వాధీనం చేసుకున్న సరుకుతో పాటు నిందితుడు మనీశ్‌ను మలక్‌పేట పోలీస్‌లకు అప్పగించారు. దాడుల్లో ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ మోహన్‌ కుమార్, మలక్‌పేట ఎస్‌హెచ్‌ఓ గంగా రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ లు సత్యనారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, రమేశ్, గోవింద్‌ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. మనీశ్‌ తయారు చేస్తున్న ఉత్పత్తుల శాంపిల్స్‌ను ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సేకరించారు. తయారీ కేంద్రానికి లేబర్, జీహెచ్‌ఎంసీ ట్రేడ్‌ లైసెన్స్, లేవని సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top