బాయ్‌ఫ్రెండ్‌ కోసం కూతురు.. ఆమె కోసం తల్లి.. | Pendurthi Police Chased the Robbery Case | Sakshi
Sakshi News home page

‘ఇల్లు చక్కబెట్టిన’ తల్లీకూతురు

Jun 13 2018 7:08 AM | Updated on Aug 30 2018 5:27 PM

Pendurthi Police Chased the Robbery Case - Sakshi

పెందుర్తి (విశాఖపట్నం): తల్లిదండ్రుల కష్టార్జితాన్ని స్నేహితుడికి దోచిపెట్టిన కుమార్తె, సొమ్ము పోయిందని పోలీసులను బురిడీ కొట్టించబోయిన ఇల్లాలు చివరికి కటకటాల పాలయ్యారు. సస్సెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించిన పెందుర్తిలోని చోరీ కేసును పోలీసులు మంగళవారం ఛేదించారు. క్రైం బ్రాంచ్‌ ఎస్‌ఐ జి.డి బాబు తెలిపిన వివరాల మేరకు.. పెందుర్తి నాలుగు రోడ్ల కూడలికి సమీపంలో డాక్టర్‌ కోట ఉమాకుమార్‌ శంకర్రావు (డాక్టర్‌ శంకర్రావు) నివాసం ఉంటున్నారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం కుటుంబమంతా బయటకు వెళ్లగా చోరీ జరిగింది. విషయం తెలిసి ఇంటికి వచ్చిన శంకర్రావు పడకగదిలో సామగ్రి చిందరవందరగా పడి ఉండడాన్ని గుర్తించి బీరువాను పరిశీలించారు. అందులోని 70 తులాల బంగారం, 1400 గ్రాముల వెండిì ఆభరణాలతో పాటు రూ.5.40 లక్షల నగదు పోయినట్లు గుర్తించి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చోరీ జరిగిన తీరుతోనే... 
దొంగతనం తీరు తొలి నుంచి అనుమానాలకు తావునిచ్చింది. ఎలాంటి విధ్వంసం లేకుండా జరిగిన ఈ చోరీ తెలిసిన వారి పనిగా అంతా అనుకున్నారు. పోలీసులు కూడా ఆ దిశలోనే ఆలోచించి చోరీ జరిగిందని మొదట గుర్తించిన శంకర్రావు కుమార్తె లిఖితను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె దొరికిపోయింది. పాతపెందుర్తికి చెందిన తన స్నేహితుడు రవికిరణ్‌ ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు ఈ నేరం చేసినట్లు అంగీకరించింది. రోజులాగే తండ్రి శంకర్రావు సాయంత్రం ఆçస్పత్రికి వెళ్లగా తల్లి మహాలక్ష్మి పనిమీద బయటకు వెళ్లింది. తాను స్థానికంగా ఉన్న బంధువుల ఇంటికి వెళతానని చెప్పిన లిఖిత ఇంటిలోనే ఉండిపోయి రవిని పిలిపించుకుని బీరువాలోని 30 తులాల బంగారం, రూ.3,03,000 నగదును  ఇచ్చి పంపింది.

అనంతరం లిఖిత బీరువాలోని వస్తువులు చిందరవందర చేసి తల్లికి ఫోన్‌ చేసి దొంగతనం జరిగినట్లు నమ్మించింది. వెంటనే ఇంటికి వచ్చిన మహాలక్ష్మి పోయిన సొత్తును అధికంగా చెబితే రికవరీ కూడా ఎక్కువగా వస్తుందన్న అత్యాశతో బీరువా లాకరులో మిగిలి ఉన్న దాదాపు 40 తులాల బంగారం, రూ.2,37,000 నగదు, 1,400 గ్రాముల వెండి ఆభరణాలను బంధువుల ఇంటికి తరలించింది. పై విషయాలు ఏవీ తెలియని శంకర్రావు మొత్తం సొమ్ము దొంగలే పట్టుకుపోయారని ఫిర్యాదు చేశాడు. అయితే కేసును చాలెంజ్‌గా తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో ముగ్గురి బాగోతం బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement