అమ్మకానికి ‘అవుట్‌సోర్సింగ్‌’ పోస్టులు

Outsourcing Posts For Sale - Sakshi

ఎస్‌ఎస్‌ఏలో భర్తీకి సిద్ధంగా 132 పోస్టులు

రంగప్రవేశం చేసిన దళారులువిజయనగరం

విజయనగరం,అర్బన్‌:  సర్వశిక్షాభియాన్‌ పర్యవేక్షణలో పనిచేస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ నిరుద్యోగులకు అశనిపాతంగా మారింది. ప్రస్తుత కాంట్రాక్ట్‌ పద్ధతికి స్వస్తి పలికి అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 – 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితి విద్యతో పాటు పిల్లల ఆసక్తి మేరకు వారికి స్వయం ఉపాధి లభించేలా వివిధ వృత్తి శిక్షణలు ఇప్పించడానికి ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలి.

ఇంతకుముందు ఈ పోస్టులను నేరుగా ఎస్‌ఎస్‌ఏ అధికారులే కాంట్రాక్ట్‌ పద్ధతిన భర్తీ చేసేవారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు రావడంతో నియామకాలు వివాదాస్పదంగా మారాయి. దీన్ని సాకుగా తీసుకొని వీటి భర్తీ ప్రక్రియను అవుట్‌ సోర్సింగ్‌ వ్యవస్థకు ఇటీవల అప్పగించారు. ఇదే అదునుగా కొందరు దళారులు ఆయా ఏజెన్సీ నిర్వాహకులతో సంబంధం ఉందని, తాము కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలుకుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.

పార్వతీపురం డివిజన్‌ పరిధిలోని కేజీబీవీ పాఠశాలల్లో రెండు ఉపాధ్యాయ పోస్టులకు రూ.లక్ష వంతును దళారులు అడ్వాన్స్‌ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి నిరుద్యోగులను వంచించకుండా విద్యార్హతలు, ప్రతిభ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టాలని మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.  

132 ఖాళీలు

జిల్లాలో కేజీబీవీల్లో ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, ఇన్‌స్ట్రక్టర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులు 132 వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ప్రత్యేక అధికారుల పోస్టులు 4, వివిధ సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయులు (సీఆర్‌టీలు) 7, పీఈటీలు 1, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 1, ఎంఐఎస్‌ కోర్డినేటర్లు 15, క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్స్‌ (సీఆర్‌పీ)లు 36, ఇవికాకుండా వివిధ విభాగాలలోని ఖాళీలు కలిపి 132 వరకు పోస్టులున్నాయి.

ఈ పోస్టులను భర్తీ చేయాలని కృపా రూరల్‌ డవలెప్‌మెంట్‌ సొసైటీ (సంతపేట, ఒంగోలు) అనే అవుట్‌ సోర్సింగ్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఈ పోస్టుల పేరుతో బేరసారాలు జరుగుతున్నాయి. అనేక మంది నిరుద్యోగులు వాటిపై ఆశలు పెట్టుకోవడంతో దాన్ని సొమ్ము చేసుకోవడానికి దళారులు రంగంలోకి దిగారు.

నిరుద్యోగులకు దళారులు వల

 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి అర్హులైన అభ్యర్థులను సమకూర్చి పెట్టడం వరకే  ఏజెన్సీల పాత్ర ఉంటుంది. వారిలో ప్రతిభాసామర్థ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే నలుగురు సభ్యుల బృందం ఖరారు చేస్తుంది. ఈ నియామకాలకు ఎస్‌ఎస్‌ఏ పీఓ మెంబర్‌ కన్వీనర్‌గా, జిల్లా డైట్‌ కళాశాల ప్రిన్సిపల్, డీఈఓలు సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీనే ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఖరారు  చేస్తుంది. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రస్తుతం అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకే ఎంపిక బాధ్యత ఉంటుందని, ఈ సంస్థ ఎవరిపేర్లు పంపితే వారి పేర్లతోనే నియామక ఉత్తర్వులు వస్తాయని పలువురు దళారులు నిరుద్యోగులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. 

అమ్మకాలకు పాల్పడుతుందెవరు?

జిల్లాలో కేజీబీవీ అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులను అమ్మకాలు చేపుడుతున్నది ఎవరనేది చర్చనీయంశంగా మారింది. ఏజెన్సీలకు చెందిన నిర్వాహకులా..? లేక వారి పేరుతో ఇతరులు ఎవరైనా ఈ అక్రమాలకు తెగబడుతున్నారా అనేదానిపై స్పష్టత రాలేదు. ఉద్యోగిని సమకూర్చినందుకు నియామక సంస్థకు ప్రభుత్వమే నెలవారీ కమీషన్‌ ఇస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు.

ఒకవేళ జిల్లా అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ హక్కు తెచ్చుకోవడానికి భారీగా సూట్‌కేసులు ఇస్తే మాత్రం దండుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులతో దళారులకు సంబంధాలు ఉన్నాయని, అందుకే తాము ఇప్పటికే కొంత అడ్వాన్సుగా ముట్టజెప్పామని బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగి చెప్పారు. మరోవైపు ఈ నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే వీటితో సంబంధం లేకుండా దళారులు నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు.

దళారుల వసూళ్లతో సంబంధం లేదు

జిల్లాలోని కేజీబీవీలలో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో రాష్ట్రస్థాయిలో చేపడతారు. ఇందుకు సంబంధించిన జిల్లా ఏజెన్సీని ప్రకటించారు. పోస్టుల భర్తీ విషయంలో దళారులు డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అలాంటివి ఎక్కడైనా జరిగినా ఎస్‌ఎస్‌ఏకి సంబంధం లేదు. 

–ఎస్‌.లక్ష్మణరావు,  ఎస్‌ఎస్‌ఏ పీఓ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top