ప్రేమను వదులుకోలేక.. తల్లిదండ్రులను కాదనలేక..

NEET Student Suicide In Hyderabad - Sakshi

4వ అంతస్తు నుంచి దూకి సన ఆత్మహత్య

హైదరాబాద్‌ : అటు ప్రేమను వదులు కోలేక, ఇటు తల్లిదండ్రులను కాదనలేక సన అనే విద్యార్థిని తల్లిదండ్రుల కంళ్ల ముందే హాస్టల్‌ భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నీట్‌లో అర్హత సాధించలేకపోయానన్న బాధతో 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన జస్లీన్‌ కౌర్‌ ఘటనను మరువకముందే అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం ముషీరాబాద్‌లో జరిగింది. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన మహ్మద్‌ గౌస్, మెహరున్నీసా బేగంకు కుమారుడు ఇమ్రాన్, కుమార్తె మహ్మద్‌ సన (17) ఉన్నారు. సన ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ డొమెస్టిక్‌ సైన్స్‌ ట్రైనింగ్‌ కళాశాలలో హోం సైన్స్‌ విభాగంలో రెండవ సంవత్సరం చదువుతోంది.

ముషీరాబాద్‌ గంగపుత్ర కాలనీలో బీసీ బాలికల హాస్టల్‌లో గత రెండేళ్ల నుంచి నివసిస్తోంది. తన స్నేహితురాలి బంధువు, గోదావరిఖని బేగంపేటలోని సెయింట్‌నరీ కాలనీకి చెందిన శ్రావణ్‌(18)తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.    రంజాన్‌ సందర్భంగా స్వగ్రామం వెళ్లిన సన పండుగ రోజు శ్రావణ్‌ను ఇంటికి ఆహ్వానించింది. శ్రావణ్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చి 2రోజుల తర్వాత తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో అతనిని ప్రేమిస్తున్నానని చెప్పింది. తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి అతనిని మరచిపోయి బుద్దిగా చదువుకోమని హెచ్చరించి హాస్టల్‌కు పంపించారు. రెండు రోజులు కాలేజీకి హాజరైన సన.. ఫోన్‌ చేస్తున్నప్పటికి సమాధానం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు, అన్న బుధవారం ఉదయం హాస్టల్‌కు వచ్చారు. 

కుటుంబసభ్యులతో వాగ్వివాదం 
సుమారు గంటన్నర సేపు కూతురు, తల్లిదండ్రుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. చదువు అవసరం లేదు, ఇంటికి వెళ్లిపోదాం... అని తల్లిదండ్రులు చెప్పగా తాను ఇక్కడే ఉండి చదువుకుంటానని సన తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు.. రాకపోతే ఇదే బిల్డింగ్‌ పై నుంచి దూకి చనిపోతామని హెచ్చరించారు. బలవంతంగా ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో తండ్రి చేతుల్లో ఉన్న తనచేతిని గుంజుకుని భవనం 4వ ఫ్లోర్‌ టెర్రస్‌ మీదకు సన పరుగెత్తింది.

కూతురు వెంట తండ్రి, తల్లి, బంధువులు కూడా పరుగెత్తారు. సన కిందకు దూకే క్రమంలో తండ్రి పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆమె చున్నీ మాత్రమే చేతికి చిక్కింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా 11.30 గంటల ప్రాంతంలో మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన డైరీని పరిశీలించగా ఐ మిస్‌ యు శ్రావణ్‌.. అని రాసి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top