వృత్తి మటన్‌ వ్యాపారం...ప్రవృత్తి దొంగతనాలు

Mutton Shop Owner Part time Robberies - Sakshi

గుడ్లవల్లేరు : గన్నవరంలో మటన్‌ దుకాణాన్ని నడుపుకునే ఓ యువకుడు తన ప్రవృత్తిని దొంగతనాలుగా ఎంచుకున్నాడు. నేర ప్రవృత్తి గల కొల్లిశెట్టి భీమరాజు అలియాస్‌ వీర్రాజును శుక్రవారం గుడ్లవల్లేరు పోలీసులు కోర్టుకు అప్పగించారు. నిందితుడిని పట్టుకునేందుకు తన బృందంతో కలిసి రాత్రింబవళ్లు కష్టపడి గుడ్లవల్లేరు ఎస్‌ఐ పి.విజయ్‌కుమార్‌ చాకచక్యంగా వ్యవహరించారని పామర్రు సీఐ డి.శివకుమార్‌ అభినందించారు. గత నెల 22వ తేదీన గుడ్లవల్లేరు మండలం వేమవరంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడాలి జ్యోతికి చెందిన రూ.90వేల విలువైన బంగారు ఆభరణాలను నిందితుడు భీమరాజు చోరీ చేశాడు. 2006లో జరిగిన చోరీలో నిందితుడి వేలిముద్రల ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టారు. చివరకు గుడ్లవల్లేరు బస్టాండ్‌లో దొంగిలించిన సొత్తుతో సహా పట్టుబడ్డాడు.

నిందితుడు గన్నవరంలో ఆదివారం మటన్‌ దుకాణాన్ని నడుపుతాడు. వారంలో మిగిలిన ఆరు రోజులు చోరీలు చేస్తాడు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 10 పోలీస్‌స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదయ్యాయి. 2006లో తన సొంత గ్రామం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద దేవరపల్లిలోనే దుకాణంలో సీడీలను దొంగిలించి బాల నేరస్తుడిగా శిక్షను అనుభవించాడు. 2011లో భీమడోలులోని ఒక దుకాణంలో రీచార్జ్‌ కూపన్లను దొంగిలించాడు. 2014లో కొవ్వూరులో బైక్‌ దొంగతనాలు చేశాడు. 2017లో పామర్రులో గొర్రెలను, అదే ఏట నూజివీడులో బైక్‌ దొంగతనాలకు పాల్పడ్డాడు. ద్వారకా తిరుమలో గ్యాస్‌ ఏజెన్సీలో చోరీకి  పాల్పడ్డాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top