శుభకార్యానికి వెళ్లొస్తూ..

Mother And son Died In Road Accident Nalgonda - Sakshi

శుభకార్యంలో పాల్గొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన ఓ తల్లీకుమారుడిని మృత్యువు కబళించింది. మితిమీరిన వేగం.. ఆపై డ్రైవర్‌ నిర్లక్ష్యానికి కనుమూసి తెరిచేలోపే రెండు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం కొత్తగూడెం చౌరస్తాలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సంస్థాన్‌ నారాయణపురం (మునుగోడు) : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపుర్‌ గ్రామానికి చెందిన గొర్రెంకల ధనమ్మ(50), అతడి కుమారుడు యాదగిరి(24) శుక్రవారం బైక్‌పై నల్లగొండ జిల్లా మునుగోడుకు వచ్చారు. అక్కడ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు. శనివారం స్వగ్రామం చిత్తాపుర్‌కు బైక్‌పై బయలుదేరారు.

మృతదేహాలు చెల్లాచెదురుగా..
హైదారాబాద్‌లోని చంపాపేట్‌కు చెందిన ఓ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న తోర్పనూరి దానయ్య, భార్య పద్మతో కలిసి కారులో చండూరు మండలంలోని తన వ్యవసాయ భూమి వద్దకు వెళుతున్నాడు. అయితే మార్గమధ్యలో కొత్తగూడెం స్టేజి వద్ద ఎదురుగా వస్తున్న యా దగిరి, ధనమ్మల బైక్‌ను రాంగ్‌రూట్‌లో వచ్చి వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌ సుమారు పది మీటర్ల ఎత్తుకు ఎగిరింది. బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లీకుమారుడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా, దానయ్య కారు కూడా అదుపుతప్పి సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టడంతో వారిద్దరికి గాయాలయ్యాయి.

పెద్దసంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు
ప్రమాద విషయం తెలుసుకున్న కొత్తగూడెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన తల్లీకుమారుడు విగతజీవులుగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్‌ఐ యాదవరెడ్డి ఘట న స్థలాన్ని పరిశీలించి తొలుత ప్రమాదంలో గాయపడిన దానయ, అతడి భార్య పద్మను చౌటుప్పల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం మేరకు చౌటుప్పల్‌ సీఐ వెంకటేశ్వర్లు కొత్తగూడెం చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండడంతో వాటి పుటేజీలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాలను చౌటుప్పల్‌ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

ఆరు నెలల కిందటే వివాహం..
ప్రమాదంలో మృతిచెందిన ధనమ్మకు భర్త చంద్ర య్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. పెద్దకుమారుడు యాదగిరికి ఆరుమాసాల క్రితమే వివాహం జరిగింది. ఇతను ఫిలింసిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల బంధువులు చౌటుప్పల్‌ ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. శుభకార్యానికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top