యువతులకు వల వేసిన కేటుగాడు అరెస్టు

Matrimonial Sites Cheater China Ramaiah Arrest in kaikaluru - Sakshi

తెలుగు మ్యాట్రీ మోనిడాట్‌కామ్‌ పేరుతో మోసం

ఉద్యోగాల ఇప్పిస్తానంటూ రూ.లక్షల టోకరా

కేసు ఛేదించిన కైకలూరు పోలీసులు  

కైకలూరు: పెళ్లి సంబంధాలు, ఉద్యోగాల పేరుతో యువతులు, నిరుద్యోగులను మోసం చేసిన కేటుగాడిని కైకలూరు పోలీసులు అరెస్టు చేశారు.  కైకలూరు టౌన్‌స్టేషన్‌లో సీఐ కేఎన్‌వీ జయకుమార్‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు.  గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం, చమల్లమూడి గ్రామానికి చెందిన బేతపూడి చినరామయ్య(42)కు భార్య, ఇరువురు సంతానం. విజయవాడలో ఇంటర్నెట్‌ సెంటర్‌ పెట్టి నష్టపోయాడు. తరువాత ఇంటి నిర్మాణం చేసి అప్పులపాలయ్యాడు. చివరికి నరసరావుపేటలో అద్దెకు దిగాడు. ఇంటర్నెట్‌ సెంటర్‌ అనుభవంతో తెలుగు మ్యాట్రీ మోనిడాట్‌కామ్‌లో తనకు వధువు కావాలని తప్పుడు చిరునామా ఇచ్చాడు. లైక్‌లు కొట్టిన మహిళలు, యువతలకు ఫోన్‌ చేసి తాను యూఎస్‌ఏ నాసా, న్యూ ఢిల్లీ జవ్‌సియానా ఎయిర్‌ క్రాఫ్ట్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా ఉద్యోగం చేస్తున్నానని నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించాడు. కైకలూరులో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు వివరించారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, ల్యాప్‌టాప్, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో టౌన్‌ ఎస్‌ఐ షణ్ముఖసాయి పాల్గొన్నారు. 

మోసాల తీరిది...
సైబర్‌నేరగాడి చినరామయ్య ఫేస్‌బుక్‌ ద్వారా రావూరి రాము, లంక ప్రకాష్, భాస్కరరావు, విజయ్‌ అనే పలు పేర్లుతో మహిళలను వల వేస్తుంటాడు. పరిచయం అయిన తరువాత తన అన్నకుంటుంబం ఆపదలో ఉందని డబ్బు కావాలని, త్వరలోనే మనం వివాహం చేసుకుందామని నమ్మబలుకుతాడు. ఏటీఎంలు తీసుకుంటాడు. కొద్ది రోజులకు మీ బంధువులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి వద్ద డబ్బులు గుంజుతాడు. కైకలూరులో ఉద్యోగం చేసే నాగలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె ఏటీఎం తీసుకుని రూ.2లక్షలు డ్రా చేశాడు. ఆమె బంధువు అంబటి శ్యామ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2లక్షలు తీసుకున్నాడు. బాపులపాడు మండలం కొత్తమల్లవల్లి గ్రామానికి చెందిన గజ్జల స్వాతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.లక్షా 60వేలు తీసుకున్నాడు. ఆమె ద్వారా అడపాక పెద్దిరాజుకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇస్తానని రూ.2లక్షల 20వేలు దండుకున్నాడు. పాలకోడూరు మండలం శృంగవృక్షంకు చెందిన ఆకుమర్తి చంద్రశేఖర్‌కు విజయ్‌ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని ఉద్యోగం ఇస్తానని రూ.85,000 తీసుకున్నాడు. ఇలా ఎందరినో మోసం చేశాడు. అతడిపై విజయవాడ, వీరవల్లి పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top