వివాహిత బలవన్మరణం

Married Woman Commits Suicide in PSR Nellore - Sakshi

భర్త వేధింపులే కారణం

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

నెల్లూరు(క్రైమ్‌): వారిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వ్యసనాలకు బానిసైన భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. ఆది వారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమెను తీవ్రంగా కొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. మనస్తాపానికి గురైన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు వెంగళరావ్‌నగర్‌ సీ బ్లాక్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరా లిలా ఉన్నాయి. వెంగళరావ్‌నగర్‌ సీ బ్లాక్‌లో హుస్సేన్‌సాహెబ్‌ మస్తానమ్మ దంపతులు ఉంటున్నా రు. వారికి ముగ్గురు పిల్లలు. చిన్నకుమార్తె సుల్తానీ అలియాస్‌ సుప్రియ (24) అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ చంద్రశేఖర్‌లు ప్రేమించుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వివాహమైన కొద్దిరోజులు కాపురం సజావుగా సాగింది. తర్వాత చంద్రశేఖర్‌ వ్యసనాలకు బానిసై కుటుంబపోషణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి.

అయినా మార్పురాలేదు
పలుమార్లు సుప్రియ భర్తను పద్ధతి మార్చుకోవాలని కోరింది. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత పెద్దలు రాజీకుదిర్చారు. దీపావళి సందర్భంలో గొడవలు తీవ్రరూపం దాల్చడంతో మళ్లీ ఆమె తన పుట్టింటికి వెళ్లింది. చంద్రశేఖర్‌ అక్కడకు వెళ్లి భార్యతోపాటు అత్తమామలపై దాడిచేశాడు. అత్త చేయిని విరగొట్టాడు. అప్పట్లో బాధితురాలు మహిళా పోçలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యను బాగా చూసుకుంటానని నమ్మబలకడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. రెండు, మూడురోజులు తర్వాత చంద్రశేఖర్‌ మళ్లీ భార్యను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. తల్లికి చేయివిరగడంతో సుప్రియనే వారికి వంటచేసి వచ్చేది. ఆదివారం ఉదయం తల్లికి చికెన్‌ ఇచ్చి మళ్లీ వచ్చి వంట చేస్తానని చెప్పి తన ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో దంపతుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సుప్రియను తీవ్రంగా కొట్టి చంద్రశేఖర్‌ ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు.

సుప్రియ తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె పిల్లల్ని బయటకు పంపి ఇంటిలోపల గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వంట చేసేందుకు వస్తానని చెప్పిన కుమార్తె ఎంతకీ రాకపోవడంతో మస్తానమ్మ సుప్రియ ఇంటివద్దకు చేరుకుంది. కిటికీలోనుంచి తొంగిచూడగా సుప్రియ ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని చూసి పెద్దగా కేకలు వేసింది. స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిచూడగా ఆమె అప్పటికే మృతిచెంది ఉంది. వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ నరసింహరావు, ఎస్సై కొండయ్యలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి ఇన్‌స్పెక్టర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చి చంద్రశేఖర్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top