దమ్‌ మారో దమ్‌!

Marijuana Smuggling in Hyderabad - Sakshi

గంజాయి మత్తు.. యువత చిత్తు

సిటీలో తేలిగ్గా లభిస్తున్న మాదకద్రవ్యం

ఖరీదు తక్కువే కావడంతో అటువైపు మొగ్గు

నగరంలో ‘గంజాయి మత్తు’ ఎక్కువైంది. తక్కువ ధరలకు లభిస్తున్న ఈ మత్తు పదార్థం యువతను చిత్తు చేస్తోంది. స్కూలు విద్యార్థులు సైతం దీనికి బానిసలవుతున్నారు. నగరంలో వాడుకలో ఉన్న, చిక్కుతున్న మాదకద్రవ్యాల్లో గంజాయి మొదటి స్థానంలో ఉండడం ఇందుకు నిదర్శనం.

రాజధాని నగరంలో మాదకద్రవ్యాలు రాజ్యమేలుతున్నాయి. వీటిలో వివిధరకాలైన డ్రగ్స్‌కు యువతతో పాటు స్కూలు విద్యార్థులు బానిసలుగామారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తక్కువ ధరకు లభించడం, తేలిగ్గావినియోగించేందుకు వీలుగా ఉండడంతో అత్యధికులు గంజాయికిబానిసలవుతున్నారు. నగరంలో వాడుకలో ఉన్న, చిక్కుతున్న మాదకద్రవ్యాల్లో గంజాయి మొదటి స్థానంలో ఉండడం ఇందుకు నిదర్శనం. కేంద్రం అధీనంలో పనిచేసే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) సైతం గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిపెడుతున్నాయంటే నగరంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి వాడుతున్న వారిలో అత్యధికులు విద్యార్థులు అందులోనూ మైనర్లు కావడం ఆందోళన కలిగిస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో :సిటీలో చేతులు మారే మాదకద్రవ్యాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. వృక్షాల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కోటిక్‌ సబ్‌స్టాన్సస్‌. ప్రయోగశాలల్లో తయారు చేసే సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సస్‌. మొక్క నుంచి ఉత్పత్తయ్యే గంజాయి నార్కోటిక్స్‌ కేటగిరీలోకి వస్తుంది. దీన్ని ఉత్పత్తి, రవాణా, విక్రయం సైతం అత్యంత తేలికగా మారిపోయింది. అత్యధికులు గంజాయిని నేరుగా తీసుకుంటుండగా.. కొంత మంది మాత్రం దీని అనుబంధ ఉత్పత్తులైన చెరస్, హషీష్‌ ఆయిల్, బంగ్‌ తదితరాలను వాడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల సైకోట్రోపిక్‌ సరఫరా, వినియోగంపై నిఘా ముమ్మరం కావడంతో గంజాయి వినియోగం పెరిగినట్లు పోలీసులు గుర్తించారు.  

సిగరెట్‌తో ప్రారంభమై బానిసలుగా..  
గంజాయికి బానిసలుగా మారుతున్న వారిలో విద్యార్థులు సైతం ఎక్కువగా ఉంటున్నారు. వీరు ఈ మత్తుకు దశల వారీగా అలవాటుపడి బాసిసలుగా మారుతున్నారని పోలీసులు వివరిస్తున్నారు. హైస్కూల్, జూనియర్‌ కాలేజీ స్థాయికి వచ్చిన తర్వాత ప్రాథమికంగా సిగరెట్‌ అలవాటు చేసుకుని.. సొంతంగా ప్రేరణ పొందడం, స్నేహితులు ప్రేరేపించడం ద్వారా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నాళ్లకు సిగరెట్‌ నుంచి హుక్కా పార్లర్‌ వైపు వీరి అడుగులు పడుతున్నాయి. అక్కడే గంజాయి అలవాటు చేసుకుంటున్నారు. ఇది ప్యాషన్‌గా ప్రారంభమై కాలానుగుణంగా బానిసలైపోతున్నారు.

అనేక మార్గాల్లో సిటీకి రవాణా
సిటీలోకి అనేక పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న పాన్‌ డబ్బాలు, ఇతర దుకాణాలే గంజాయి విక్రయ కేంద్రాలుగా ఉంటున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యంత రహస్యంగా, కేవలం పరిచయం ఉన్న, పాత వినియోగదారులకు మాత్రమే దీన్ని అమ్ముతున్నట్టు పోలీసుల మాట. ఒకప్పుడు వరంగల్, మెదక్, జహీరాబాద్‌ ప్రాంతాల నుంచి గంజాయి సిటీకి వచ్చేది. ఇటీవల ఇక్కడ సాగు కనుమరుగవడంతో విశాఖజిల్లా ఏజెన్సీ ప్రాంతంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా  అవుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేక వాహనాలు, ఆర్టీసీ/ప్రైవేట్‌ బస్సులతో పాటు రైళ్లల్లోనూ భారీ మొత్తంగా గంజాయి సిటీకి అక్రమ రవాణా అవుతోంది. 

పర్యవేక్షణ లేక పెరిగిన వినియోగం
యువత ప్రధానంగా విద్యార్థులు గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాలను బానిసలుగా మారడానికి ప్రధాన కారణం పర్యవేక్షణ కొరవడటమే అని పోలీసులు వివరిస్తున్నారు. ఇటు ఇళ్లు, అటు పాఠశాలల్లోనూ వీరి కదలికల్ని కనిపెట్టే విధానాలు కొరవడ్డాయి. అడిగినంత పాకెట్‌ మనీ ఇస్తూ, ప్రైవసీ పేరుతో ప్రత్యేకంగా గదులు కేటాయిస్తున్న కుటుంబాలతో పాటు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులైన సందర్భాల్లోనూ పిల్లలపై పర్యవేక్షణ లేక పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్, చిన్నపాటి గదుల్లో ఉంటున్న వారూ దీనికి అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రుల తర్వాత పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాల్సిన ఉపాధ్యాయులు, స్కూలు యాజమాన్యాలు సైతం కేవలం విద్యాబోధన వరకే పరిమితం అవుతున్నాయి.  

ఇదో మైనర్‌ కథ
ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఓ మైనర్‌ డ్రగ్‌ పెడ్లర్‌గా మారాడు. గంజాయితో మొదలెట్టి మాదకద్రవ్యమైన ఎక్స్‌టసీని తాను వినియోగించడంతో పాటు మరికొందరికి విక్రయించడం ప్రారంభించాడు. చివరకు గతనెలలో ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాడు. తార్నాక నాగార్జుననగర్‌కు చెందిన ఓ మైనర్‌ పదో తరగతిలో ఉండగానే హుక్కాకు అలవాటుపడ్డాడు. శివంరోడ్‌లోని ఓ హుక్కా పార్లర్‌కు రెగ్యులర్‌ కస్టమర్‌గా మారాడు. కొన్నాళ్లకు హుక్కాతో పాటు గంజాయికీ బానిసయ్యాడు. ధూల్‌పేట ప్రాంతానికి చెందిన కిషోర్‌ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనేవాడు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో తన ఇంటిపై ఉన్న గదిలోనే స్నేహితులతో కలిసి హుక్కా, గంజాయి పీల్చేవాడు. ఇతడికి మెహదీపట్నం ప్రాంతానికి చెందిన హన్నన్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. ఇతడి నుంచి ఎక్స్‌టసీ, ఎల్‌ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాలు కొనడం ప్రారంభించిన మైనర్‌.. తొలినాళ్లలో తానే వినియోగించేవాడు. కొన్నాళ్లకు విక్రేతగా మారి పోలీసులకు చిక్కాడు.  

కస్సోల్‌లో ఖరీదైన గంజాయి
స్థానికంగా లభిస్తున్న గంజాయి ధర తక్కువగా ఉంటోంది. కొకైన్, హెరాయిన్, బ్రౌన్‌షుగర్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ తదితర మాదకద్రవ్యాలు ఖరీదు చేయాలంటే గ్రాముకు లేదా డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించాలి. దీంతో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి యువత, విద్యార్థులు గంజాయి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. కేవలం రూ.500 వెచ్చిస్తే 100 గ్రాములు దొరికే అవకాశం ఉండటం, బహిరంగానైనా దీన్ని సిగరెట్లలో పెట్టుకుని కాల్చే అవకాశం ఉండటంతో ఇటువైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి దశలో ప్రారంభమైన ఈ అలవాటు ఎన్నేళ్లయినా కొనసాగుతోంది. ఉన్నత వర్గాలకు చెందిన వారిలోనూ గంజాయి బానిసలు ఉన్నప్పటికీ.. వారు వినియోగించేది మాత్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని కస్సోల్‌ ప్రాంతంలో నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇది 100 గ్రాములు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందని, సిటీలో దీని వినియోగం అత్యంత తక్కువని పోలీసులు చెబుతున్నారు. నగరంలో గంజాయికి ‘ఓ మాల్‌’ అనే కోడ్‌ ఉంది. ఈ పేరుతోనే పాన్‌ డబ్బాలు, దుకాణాల ద్వారా విక్రయం జరుగుతోందని సమాచారం.  

ఓసీబీ స్లిప్‌లకు మహా డిమాండ్‌
సాధారణ సిగరెట్లలో నింపుకుని గంజాయి కాల్చే వారితో పాటు ఓసీబీ స్లిప్స్‌లో పెట్టి కాల్చే వారి సంఖ్యా పెరుగుతోంది. గంజాయిని చేతిలో వేసుకుని నలిపిన తర్వాత దాన్ని ఓసీబీ స్లిప్‌లో చుట్టి సిగరెట్‌ తరహాలో కాలుస్తారు. మామూలు కాగితం మంట అంటుకుంటే వేగంగా కాలిపోతుంది. ఈ ఓసీబీ స్లిప్‌ ప్రత్యేకమైన కాగితం కావడంతో గంజాయి నింపినప్పుడు సిగరెట్‌ తరహాలో ఆరిపోకుండా వెలుగుతాయి. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న దుకాణాల్లో ‘ఓ మాల్‌’తో పాటు ఓసీబీ స్లిప్స్‌ కూడా విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.  

‘మచ్చ’తునకలివిగో..
సాఫ్ట్‌వేర్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగాల్లో పనిచేస్తున్న ఐదుగురు యువతీ యువకులు తమ ఫ్లాట్స్‌లో గంజాయి కాల్చుతూ కేపీహెచ్‌బీ పోలీసులకు చిక్కారు.  
బెంగళూరులోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న తార్నాక వాసిని 200 గ్రాముల గంజాయితో ఎల్బీనగర్‌ పోలీసులు పట్టుకున్నారు.  
దోమలగూడ ఏవీ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న విద్యార్థి గంజాయి కాలుస్తూ ఆదిభట్ల పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతడి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా చెందౌలి.  
మమతానగర్‌ కాలనీలోని ఎన్విరాన్‌ టవర్స్‌లోని ఓ గదిలో నివసిస్తున్న ఐదుగురు విద్యార్థులు గంజాయికి అలవాటుపడి, అది సేవిస్తూ ఎల్బీనగర్‌ పోలీసులకు చిక్కారు.  
ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఖానాపూర్‌ సమీపంలో ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు గంజాయితో అరెస్టు అయ్యారు.  

గంజాయిని నేరుగా అమ్మితే చిక్కే ప్రమాదం ఉందనే ఉద్దేశంలో పెడ్లర్స్‌ వివిధ రూపాల్లో సంగ్రహించి విక్రయాలు చేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నం సమీపంలోని అరకు నుంచి గంజాయి అనుబంధ ఉత్పత్తి అయిన ‘హష్‌ ఆయిల్‌’ను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. అలాగే గంజాయిని చాక్లెట్ల రూపంలో మార్చి పాన్‌షాపుల ద్వారా అమ్ముతున్న ఉదంతాలూ వెలుగులోకి వచ్చాయి. ఫతేనగర్‌లోని రెండు దుకాణాలపై దాడి చేసిన ఎక్సైజ్‌ పోలీసులు 1480 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పెడ్లర్లు నగరంతో పాటు శివార్లలోని విద్యార్థులు, యువత, ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా అమ్ముతున్నట్లు గుర్తించారు.  

రిహాబిలిటేషన్‌ సెంటర్‌ అవసరం  
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు గంజాయి, మాదకద్రవ్యాలకు బాసిలయ్యారని తెలిసినా పిల్లలకు ట్రీట్‌మెంట్‌ చేయించేందుకు ముందుకు కావడంలేదు. బయటకు తెలిస్తే తమ పరువు పోతుందనే ఉద్దేశంతో పాటు రిహాబిలిటేషన్‌ సెంటర్లకు వెళ్లే స్థోమత లేకపోవడమూ దీనికి కారణంగా మారుతోంది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి పోలీసు విభాగం ‘భరోస’ సెంటర్‌ ఏర్పాటు చేసింది. అన్ని రకాలైన సహాయ సహకారాలనూ ఒకే గొడుకు కిందికి తేవడంతో పాటు గోప్యతను పాటిస్తోంది. సిటీలో పెరిగిన డ్రగ్‌ కల్చర్‌ నేపథ్యంలో మాదకద్రవ్యాలకు బాసిసలైన వారిని మార్చడంతో పాటు ఈ సంస్కృతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ‘భరోస’ తరహాలోనే డ్రగ్స్‌ బానిసల కోసమూ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి ఉచిత సేవలు అందించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.  

మత్తుకు బానిసలైన వారు మాదకద్రవ్యాల వినియోగదారులుగా మారిన కొందరు ఆ డబ్బుల కోసం వాటినే అమ్ముతున్నారు. ఇలాంటి అనేక ముఠాలను పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా ఈ నెల 2వ తేదీన చిక్కిన గ్యాంగ్‌ ఇందుకు ఉదాహరణ. ఫిల్మ్‌నగర్‌లో ఉండే ఎలక్ట్రీషియన్‌ కె.భాస్కర్‌ ఓ షేరింగ్‌ రూమ్‌లో స్నేహితుడైన ఎం.విశాల్‌తో కలిసి ఉంటున్నాడు. మత్తుకు బాసిసలుగా మారిన వీరు గంజాయికి అలవాటుపడ్డారు. ఈ వ్యసనంతో పాటు ఇతర ఖర్చులూ పెరిగిపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. వీటి నుంచి బయటపడేందుకు వారే డ్రగ్‌ పెడ్లర్స్‌గా మారారు. వీరితో పాటు మరో ఇద్దరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నాలుగు రకాల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top