అర్ధరాత్రి వరకు మొబైల్‌ చూస్తున్నాడని.. కిరాతకం!

Man slashes wrist of son addicted to mobile - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మొబైల్‌ ఫోన్‌కు బానిసగా మారి.. అర్ధరాత్రి వరకు మొబైల్‌లో సినిమాలు చూస్తున్న కొడుకుపై ఆగ్రహించి ఓ తండ్రి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కొడుకు నిద్రిస్తుండగా.. అతని చేతిని మణికట్టు వరకు నరికేశాడు. ఈ షాకింగ్‌ ఘటన పహాడిషరీఫ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

వాదే ముస్తాఫా బస్తీకి చెందిన మహమ్మద్‌ ఖయ్యూం ఖురేషీ (45) ఎలక్ట్రిషియన్‌. అతని కుమారుడు మహమ్మద్‌ ఖాలేద్‌ ఖురేషి (18) కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ కొన్నాడు. ఆ ఫోన్‌లో అస్తమానం సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నాడు. దీనిని గమనించిన తండ్రి ఖయ్యూ నిత్యం మొబైల్‌ ఫోన్‌ చూడటం మంచి అలవాటు కాదని, దీనివల్ల భవిష్యత్తులో దుష్పరిణామాలు ఉంటాయని కొడుకును హెచ్చరించాడు. అయినా తండ్రి మాటను ఖాలేద్‌ లెక్కచేయలేదు. దీంతో రెండురోజుల కిందట తండ్రీ-కొడుకుల మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తండ్రికి ఎదురుతిరిగిన ఖాలేద్‌.. కోపంలో అతని చేయి కొరికి పారిపోయాడు. అనంతరం రాత్రి ఇంటికి తిరిగి వచ్చి మళ్లీ మొబైల్‌ఫోన్‌లో సినిమాలు చూడటం ప్రారంభించాడు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం కొడుకు నిద్రిస్తుండగా అతని మణికట్టును తండ్రి కత్తితో నరికేశాడు. బాధితుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top