అక్కను కొడుతున్నాడని.. బావను చంపేశారు!

Man Murdered in Srikakulam - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుని సోదరుడు

ఉర్జాంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు

శ్రీకాకుళం, పోలాకి: అక్కను నిత్యం వేధిస్తున్నాడని, అక్రమ సంబంధాలు అంటగట్టి పది మందిలో కుటుంబ పరువుతీస్తున్నాడని బావపై ఇద్దరు బావమరుదులు కలిసి అంతమొందించిన ఘటన పోలాకి మండలం ఉర్జాంలో చోటుచేసుకుంది. ఈ నెల 12న జరిగిన ఈ వివాదానికి సంబంధించి మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్‌కు చెందిన దండాశి అప్పలనాయుడుకు, ఉర్జాం గ్రామానికి చెందిన జయలక్ష్మితో 2004లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అప్పలనాయుడు తొలుత ఫొటోస్టూడియోలో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. తర్వాత వ్యసనాలకు బానిసగా మారి అనారోగ్యానికి గురయ్యాడు. ఏ పనికీ వెళ్లకుండా కొంతకాలంగా ఖాళీగానే ఉంటున్నాడు. ఇంటికి ఆదాయం లేదని, ఏదైనా పనికి వెళ్లాలని నిత్యం దంపతులిద్దరి మధ్య వివాదాలు జరిగేవి. మరోవైపు అప్పలనాయుడు భార్యపై అనుమానంతో తరచూ కొట్టేవాడు.

ఈ విషయాన్ని  జయలక్ష్మి కన్నవారైన ఉర్జాంలోని తన సోదరులు జలుమూరు అప్పన్న, రాంబాబులకు చెప్పి బాధపడేది. ఈ నెల 12న బావను ఉర్జాంలోని తమ ఇంటికి పిలిపించి బావ మరుదులిద్దరూ మందలించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇంతలోనే విశాఖపట్నం కేజీహెచ్‌లో అప్పలనాయుడు మృతిచెందాడని కుటుంబసభ్యులకు సమాచారం తెలియటంతో అప్పలనాయుడు తమ్ముడు లక్ష్మణరావుకు అనుమానం వచ్చింది.  తన అన్నను బావమరుదులే కొట్టిచంపేశారని పోలాకి పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశారు. అదే సమయంలో మృతుడి భార్య జయలక్ష్మి మాత్రం తన భర్త  మామూలుగానే కిందపడితే దెబ్బలు తగిలాయని పోలీసులకు చెప్పింది.  ఈ ఘటనపై నరసన్నపేట సీఐ మురళి దర్యాప్తు చేస్తున్నారు. 12న బావను మందలించే సమయంలో బావమరుదులు దాడిలో అప్పలనాయుడుకు తలపై బలంగా దెబ్బతగిలిందని, వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ తర్వాత పరిస్థితి విషమించటంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ ఈ నెల 19న అప్పలనాయుడు మృతిచెందినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి సీఐ మురళి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా హత్య కేసు నమోదుచేశామని, కేసు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే అప్పలనాయుడు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top