
రాయ్‌పూర్: కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే ఆమె జీవితానికి ముగింపు పలికాడు. అనుమానం అనే రోగంతో కన్నబిడ్డనే చంపి కాలయముడిలా మారాడు. ఈ విషాద ఘటన ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. మహసముంద్ జిల్లాకు చెందిన సంతోష్ దివాన్ తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతని సోదరి ఈ మధ్యే ఇంట్లోవారి అభ్యంతరాలను పట్టించుకోకుండా కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయింది. దీన్ని ఎంతో అవమానకరంగా భావించిన సంతోష్ దాన్ని మనసులో పెట్టుకున్నాడు. తన 19 ఏళ్ల కూతురు కూడా ఇలాంటి పని చేస్తుందేమోనని అనుమానాన్ని పెంచుకోసాగాడు. చెడు తిరుగుళ్లు తిరుగుతుందేమో, ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందేమో అంటూ ఆమె క్యారెక్టర్ గురించి భయపడసాగాడు.
ఆమె ఫోన్ వాడినా, బయటికి వెళ్లినా అతని మదిలో అదే సందేహం వెంటాడేది. ఈ క్రమంలో యువతి ఫోన్ వాడుతుండగా చూసి ఆమెతో గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో కూతురు విసురుగా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయింది. దీంతో సంతోష్ ఆమెను వెంబడించి మరీ పట్టుకున్నాడు. యువతి తలపై బండరాయితో పలుమార్లు మోది చంపాడు. అనంతరం ఈ హత్య గురించి తనకెలాంటి సంబంధం లేనట్టు ప్రవర్తించాడు. అయితే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ప్రశ్నించగా అసలు నిజాన్ని బయటకు కక్కాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.