సూసైడ్‌ నోట్‌ రాసి భర్త బలవన్మరణం

man commits suicide with wife harrassment - Sakshi

అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఘటన 

సాక్షి, గుంటూరు : ‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి. ఆత్మహత్య చేసుకోవడం తప్పే.. కానీ తప్పడం లేదు. నా భార్య వేధిస్తోంది. మానసికంగా చచ్చిపోయాను. పరువంతా పోయింది. చట్టాలన్నీ ఆడవాళ్లకే అనుకూలంగా ఉన్నాయి. వాళ్లనే సమర్థిస్తున్నాయి. నా విషయంలో కూడా అదే జరిగింది’ అంటూ ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దచెరువుకు చెందిన మద్దూరి సతీశ్‌బాబు(34)కు నెల్లూరు జిల్లా కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన రాధతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. సతీశ్‌ ప్రకాష్‌నగర్‌లోని నరసరావుపేట ఆక్స్‌ఫర్ట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వివాహమైన 3 నెలలకే రాధ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు నచ్చచెప్పడంతో కొన్ని నెలల తర్వాత తిరిగి భర్త వద్దకు వచ్చింది. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రెండేళ్ల కిందట సతీశ్‌ పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా.. అతన్ని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఆ సమయంలో తోడుగా నిలవాల్సిన భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి తిరిగి రాకపోవడంతో సతీశ్‌ 6 నెలల కిందట న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో 2 నెలల కిందట రాధ తన సోదరులతో కలసి సతీశ్‌ ఇంటివద్ద ఆందోళనకు దిగింది. భర్తతో కలిసి ఉంటానని చెప్పడంతో పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు.

ఆ విషయాన్ని భార్యభర్తలిద్దరూ న్యాయస్థానానికి తెలియజేశారు. అప్పట్నుంచి ఇద్దరూ కలిసే ఉంటున్నారు. మళ్లీ ఇటీవల ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రాధ పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన సతీశ్‌.. తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులు తలుపులు తెరవగా సతీశ్‌ విగతజీవిగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న సీఐ సురేంద్రబాబు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తన చావుకు భార్య రాధ ఆమె సోదరులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్‌ కారణమంటూ సతీశ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొన్నాడు. కాగా, ఈనెల 18వ తేదీనే సూసైడ్‌ నోట్‌ రాసినట్లు పోలీసులు గుర్తించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top