రైలు కిందపడి ప్రేమజంట.. | lovers committed to suicide in sullurpeta | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

Oct 6 2017 8:34 AM | Updated on Nov 6 2018 8:08 PM

lovers committed to suicide in sullurpeta - Sakshi

సాక్షి, సూళ్లూరుపేట: ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ జంటకు కులాలు అడ్డుగోడలై నిలిచాయి. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం గొల్లలములువు రైల్వేగేట్‌ సమీపంలో గురువారం జరిగింది. గూడూరు  రైల్వే ఎస్సై బాలకృష్ణయ్య కథనం మేరకు ప్రకాశం జిల్లా పరుచూరు మండలం నూతలపాడుకు చెందిన కుంభ విద్యాధరి (19), ఒల్లంగుంట ఆంజనేయులు (23)  కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇంట్లో పెద్దలకు చెప్పారు. వాళ్లు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో విద్యాధరికి పెళ్లి చేయాలని పెద్దలు సంబంధాలు చూస్తుండటంతో ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం ఊరు వదిలి వచ్చేశారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం లేక ఒకరిచేయి ఒకరు పట్టుకొని రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యాధరి కనిపించకపోవడంతో ఆమె తండ్రి పరచూరు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు ఇచ్చారని తెలుస్తోంది. ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్త తెలుసుకున్న చుట్టుపక్కల జనాలు సంఘటన స్థలానికి వచ్చి చూసి కంటతడి పెట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే ఎస్సై బాలకృష్ణయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఇద్దరిదీ పరచూరు మండలం నూతలపాడుగా గుర్తించారు. వెంటనే మృతుల బంధువులకు సమాచారాన్ని అందించారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవటంతో వాటిని మూటగట్టి పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement