పంజా విసిరిన చిరుత | Sakshi
Sakshi News home page

పంజా విసిరిన చిరుత

Published Mon, Apr 9 2018 9:41 AM

Leopard Hulchul In Mandapur Thanda - Sakshi

చిన్నశంకరంపేట(మెదక్‌): మరోసారి చిరుత పంజా విసిరింది. శనివారం రాత్రి చిన్నశంకరంపేట మండలం టి.మాందాపూర్‌ పెద్ద తండాలో రెండు లేగదూడలు చిరుత దాడిలో మృతి చెందాయి. వివరాల ప్రకారం..టీ. మాందాపూర్‌ పెద్ద తండాకు చెందిన రైతు లంబాడి దేశ్య పశువుల పాక ముందు రెండు లేగదూడలను కట్టేశాడు. అర్థరాత్రి అలికిడి కావడంతో రైతు మెల్కోని పశువుల కొట్టం వైపు చూడగా, చిరుత లేగదూడను తీసుకుపోతున్న దృష్యం కనిపించింది. బయంతో వెనక్కి వచ్చిన దేశ్య ఉదయం స్థానికుల సాయంతో అటవీప్రాంతంలో గాలించగా ఓ పెద్ద బండ వద్ద విగతజీవులైన రెండు లేగదూడలు కన్పించాయి. అక్కడే ఎండిపోయిన మరో లేగదూడ శవం కూడ ఉన్నట్లు గ్రామస్తులు గమనించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామ సర్పంచ్‌ సిద్దాగౌడ్‌ తెలిపారు.

పెద్ద బండే చిరుత స్థావరమా?
వరుస దాడులతో మెదక్, చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలను హడలేత్తిస్తున్న చిరుత టి.మాందాపూర్‌ పెద్ద తండా సీమపంలోని అటవిప్రాంతంలో ఉన్న పెద్దబండను స్థావరంగా చేసుకుని శివారు గ్రామాలపై దాడులు చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చిన్నశంకరంపేట మండలంలోని గజగట్లపల్లి, టి.మాందాపూర్, ఎస్‌.కొండాపూర్, మెదక్‌ మండలంలోని ఖాజిపల్లి, శివ్వాయిపల్లి, వెంకటాపూర్, గుట్టకిందిపల్లి గ్రామాల మధ్యన ఉన్న అటవీ ప్రాంతంలోని పెద్ద బండ వద్ద శనివారం తీసుకువెళ్లిన రెండు లేగదూడలతో పాటు మరో లేగదూడ శవం కూడ కనిపించడం అనుమానలకు కారణమైంది. అటవీశాఖ అధికారులు ఇక్కడ నిఘాను ఉంచితే చిరుత చిక్కవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement