సైనేడ్‌ కిల్లర్‌ మోహన్‌ దోషి

karnataka Court Confirm to Punish Cyanide Mohan in 19 Cases - Sakshi

యువతి హత్య కేసులో మంగళూరు కోర్టు తీర్పు  

ఇప్పటికే పలు కేసుల్లో నేర నిరూపణ

యశవంతపుర: కేరళలోని కాసరగోడులో ఓ యువతిపై ఆత్యాచారంతో పాటు అనేక కేసుల్లో దోషి అయిన సైనేడ్‌ మోహన్‌ మరో కేసులోనూ దోషిగా తేలాడు. ఈ మేరకు మంగళూరు కోర్టు తీర్పునిచ్చింది. యువతిని పెళ్లి చేసుకొంటానని నమ్మించి అత్యాచారం చేసి హత్య చేశాడు. మోహన్‌పై ఇలా 20 కేసులు నమోదు కాగా 19 కేసుల్లో కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. ఇందులో నాలుగు కేసుల్లో మరణశిక్షతో పాటు 15 కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ నెల 24న మోహన్‌కు మిగిలిన ఒక్క కేసులోనూ కోర్టు శిక్ష విధించే అవకాశం ఉంది.

యువతిని మభ్యపెట్టి హత్య  
కాసరగోడులో మహిళా హాస్టల్‌లో వంటమనిషిగా పని చేస్తున్న 25 ఏళ్లు యువతిని 2009లో మోహన్‌ పరిచయం చేసుకొన్నాడు. ప్రేమ, పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడు. 2009 జులై 8న మంగళూరు సుళ్యలోని దేవస్థానికి వెళ్దామని ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకున్నాం, త్వరలో ఇంటికి వస్తామని యువతి కుటుంబసభ్యులను నమ్మించాడు. బెంగళూరులో ఒక లాడ్జిలో రూం తీసుకొని యువతిపై ఆత్యాచారం చేశాడు. జులై 15న గర్భ నిరోధక మాత్ర అంటూ మెజెస్టిక్‌ బస్టాండ్‌లో సైనైడ్‌ మాత్రను మింగించాడు. ఆమె పబ్లిక్‌ టాయ్‌లెట్‌ వద్దకు వెళ్లి కుప్పకూలి అక్కడే ప్రాణాలు విడిచింది. ఏమీ తెలియనట్లు మోహన్‌ జారుకున్నాడు. పోలీసులు అపరిచిత యువతి మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి 2009 అక్టోబర్‌లో మోహన్‌ను అరెస్ట్‌ చేశారు. అతన్ని విచారించగా దిగ్భ్రాంతి గొలిపే దారుణాలను బయటపెట్టాడు. ఇదే మాదిరిగా ఎంతో మంది మహిళలను మభ్యపెట్టి సైనేడ్‌ ఇచ్చి హత్య చేసినట్లు వివరించాడు. ఇందులో ఎక్కువమంది కేరళ, మంగళూరు ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు. బాధిత మహిళల కుమారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మోహన్‌కు అనేక కేసుల్లో కోర్టు శిక్షలను విధించింది. ప్రస్తుతం ఇతడు బెళగావి జైల్లో ఉన్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top