రాడ్లతో దాడి చేసి.. కిడ్నాప్‌నకు యత్నించి..

Janasena activists attacked Grama Volunteers - Sakshi

కులం పేరుతో దూషించి ఇనుపరాడ్లతో దాడి 

పోలీస్‌స్టేష్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ రాజేశ్వరరావు నిరసన

సాక్షి, సఖినేటిపల్లి (రాజోలు): ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావద్దని హెచ్చరిస్తూ గుడిమూలకు చెందిన  గ్రామవలంటీర్లపై అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. గుడిమూల గ్రామానికి చెందిన వలంటీర్లు గుబ్బల రాజేష్, బత్తుల సునీల్‌లపై జనసేన పార్టీ కార్యకర్తలు నాయుడు కృష్ణస్వామి, బొలిశెట్టి దుర్గాప్రసాద్, నామన రంగబాబు, నాయుడు ఆదినారాయణ రాడ్లతో దాడి చేశారు. వలంటీరు రాజేష్‌ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌కు యత్నించారు. గుడిమూల నుంచి స్థానికులు కారును వెంబడించడంతో గొంది గ్రామంలో కారు నుంచి బయటకు తోసేశారు. 6777 నంబరు కలిగిన తెలుపురంగు షిఫ్ట్‌కారులో ఇనుప రాడ్లతో వచ్చి రాజేష్, సునీల్‌పై దాడి చేసి భయకంపితులను చేశారు.

దాడిలో గాయపడ్డ గుడిమూల వలంటీర్లు రాజేష్, సునీల్‌ 

ఈ మేరకు సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌లో వలంటీర్లు రాజేష్, సునీల్‌ను ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా వలంటీర్లు గ్రామంలో ప్రభుత్వ పథకాల మంజూరు కోసం సర్వే నిర్వహిస్తుండగా దానిని అడ్డుకుని, తమ ఇళ్ల వద్దకు సర్వే కోసం వస్తే సహించేది లేదని జనసేన కార్యకర్త నాయుడు కృష్ణస్వామి తన అనుచరులతో రాజేష్, సునీల్‌లను బెదిరించాడు. అంతేకాదు కొన్ని రోజులుగా వలంటీర్లు రాజేష్, సునీల్‌లు ప్రభుత్వ పథకాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంపైనా జనసేన కార్యకర్తలు ఆగ్రహం పెంచుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ మేరకు సఖినేటిపల్లి అడిషనల్‌ ఎస్సై భవానీకి వలంటీర్లు రాజేష్, సునీల్‌ ఫిర్యాదు చేశారు. 

వలంటీర్‌ రాజేష్‌ కిడ్నాప్‌కు యత్నించింది ఈ కారులోనే
వలంటీర్లపై దాడులకు పాల్పడితే సహించం : కో ఆర్డినేటర్‌ రాజేశ్వరరావు
గ్రామ వలంటీర్లపై దాడులకు దిగితే సహించబోమని రాజోలు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు హెచ్చరించారు. గుడిమూల వలంటీర్లపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద రాజేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు జనసేన తెరతీస్తోందన్నారు.

ఇనుపరాడ్లతో గుడిమూల గ్రామంలో హల్‌చల్‌ చేస్తున్న జనసేన కార్యకర్తలు  

ఎస్సీ సెల్‌ కార్యదర్శి నల్లి డేవిడ్‌ మాట్లాడుతూ వలంటీర్లపై దాడులు చేసేలా జనసేన అధినేత పవన్‌కల్యాణ్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీ కార్యకర్తలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ బీసీసెల్‌ కార్యదర్శి పాటి శివకుమార్, నాయకులు రావి ఆంజనేయులు, రుద్రరాజు చినరాజా, సానబోయిన ఏసుబాబు, గుండుమేను శ్రీనివాస్‌యాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు కోన ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top