'విమానం దిగుతారా.. ఈడ్చిపారేయమంటారా?'

 IndiGo Staff Accused Of Threatening Passengers  - Sakshi

సాక్షి, ముంబయి : గత కొన్ని రోజుల కిందటే పార్లమెంటు ప్యానెల్‌తో ఛీవాట్లు తిన్న ఇండిగో ఎయిర్‌లైన్‌ సంస్థ మరో అపవాదును మూటగట్టుకుంది. విమానంలోకి ఎక్కిన ప్రయాణీకులను బలవంతంగా కిందికి విమాన సిబ్బంది దింపేశారు. దాదాపు ఈడ్చిపారేసినంత పనిచేశారు. ప్రయాణీకులంటే ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించి చులకన చేసి చేయి చేసుకునేంత పనిచేశారు.

గత డిసెంబర్‌ (2017) 30న పట్నా ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ సీఈవో ఈ అనుభవాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. 'ప్రయాణీకులందరం విమానంలోకి వెళ్లాము. ఆ తర్వాత సర్వీసును రద్దు చేస్తున్నట్లు అనూహ్యంగా ప్రకటించారు. వెంటనే అందరూ దిగిపోవాలని అన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది మాపై దాడి చేసినంత పనిచేశారు. విమానంలో నుంచి దిగకపోతే ఈడ్చిపారేస్తామంటూ బెదిరించారు. బలవంతంగా విమానంలో నుంచి దింపేశారు' అని ఆయన వెల్లడించారు.

కాగా, దీనిపై స్పందించిన ఇండిగో.. ఆ రోజు ఇండిగో ఫ్లైట్‌ 6ఈ-633 (కోల్‌కతా-పాట్నా-లక్నో) రాత్రి 8.20 గంటలకు బయలుదేరాల్సి ఉంది. వాతావరణం సరిగా లేనందున విమానాన్ని రద్దు చేశాం. అయితే, ప్రయాణీకులంతా విమానం దిగేందుకు సహకరించారు. కానీ, ఓ 20మంది మాత్రం మొండికేశారు. దాంతో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారి పరిస్థితిని వివరించాం. కానీ, విమానం దిగకుండా ప్రతి ఒక్క ప్యాసింజర్‌కు వసతి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మేం మాత్రం వారిని విమానం దిగాలని చాలా మర్యాదగా అడిగాం' అని వెల్లడించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top