ఓ రైల్వే ఉద్యోగితో ఉన్న చనువుతోనే.. | Husband Revealed Wife Murder Case | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధమే కారణం?

Mar 30 2018 10:28 AM | Updated on Jul 30 2018 8:41 PM

Husband Revealed Wife Murder Case - Sakshi

గోవర్ధన్, ప్రభావతి (ఫైల్‌)

ధర్మవరం అర్బన్‌: ధర్మవరంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్య సంచలనం రేపింది. ఓ రైల్వే ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న భర్త ఎంత వారించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పాటు నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని జీర్ణించుకోలేకనే కొడవలితో భార్యను హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు....  గుట్టకిందపల్లికి చెందిన కురుబ గోవర్ధన్‌కు కందుకూరుకు చెందిన ప్రభావతిని ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. రెండేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. వారికి అయిదేళ్ల కుమార్తె లాస్య ఉంది. రైల్వే పాయింట్‌మెన్‌గా ఉన్న గోవర్ధన్‌కు ఆరేళ్ల క్రితం రైల్వేగార్డ్‌గా పదోన్నతి లభించింది. ఈ క్రమంలో విధుల్లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లే గోవర్ధన్‌ నాలుగురోజులు, వారానికోసారి ఇంటికొచ్చేవాడు. ఈ క్రమంలో గుట్టకిందపల్లికి చెందిన మరో రైల్వే ఉద్యోగితో ప్రభావతికి పరిచయం ఏర్పడి క్రమంగా వారి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు బంధువుల ద్వారా తెలుస్తోంది.

ఈ విషయంపై భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు వచ్చేవి. దీంతో నాలుగేళ్లపాటు పుట్టింటికి వెళ్లిన ప్రభావతి విడాకుల వరకు వచ్చింది. చివరికి పెద్దమనుషులు, బంధువులు కల్పించుకుని ఇరువురికి సర్దిచెప్పడంతో లోక్‌అదాలత్‌లో భార్య, భర్తలు రాజీ అయినట్లు సమాచారం. అయిదు రోజుల క్రితం భర్త వద్దకు వచ్చిన ప్రభావతి బుధవారం రాత్రి భర్త ఇంటికి వచ్చే సరికి ఫోన్‌లో ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు గమనించాడు. దీంతో ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నావు నీ పద్ధతి మార్చుకోవా అంటూ గొడవకు దిగాడు.  గొడవ పెద్దది కావడంతో ఆగ్రహంతో గోవర్ధన్‌ ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకుని భార్యపై దాడికి యత్నించాడు. ఆమె ఇంటి నుంచి బయటకు పరుగులు తీయగా వెంబడించి ఇంటి సమీపంలో రహదారిపైన విచక్షణారహితంగా కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. అర్ధరాత్రి భార్యను హత్య చేసిన అనంతరం పరారైన గోవర్ధన్‌ గురువారం ఉదయం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గోవర్ధన్‌ లొంగిపోయినట్లు తెలిసింది.

గోవర్ధన్‌ను సస్పెండ్‌కు రంగం సిద్ధం
భార్యను దారుణంగా హత్య చేసిన రైల్వే గార్డ్‌ గోవర్ధన్‌ను సస్పెండ్‌ చేసేందుకు రైల్వే ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. పట్టణ పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్‌ నకలు తీసుకున్న వెంటనే గోవర్ధన్‌ను సస్పెండ్‌ చేయనున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement