పరువు తీస్తోందనే కోపంతో కుమార్తెను.. | Honor Killing in Prakasam Kothapalem | Sakshi
Sakshi News home page

కొత్తపాలెంలో పరువు హత్య!

Feb 5 2019 7:04 AM | Updated on Feb 5 2019 7:04 AM

Honor Killing in Prakasam Kothapalem - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో) వైష్ణవి (ఫైల్‌)

ఆస్పత్రికి వెళ్లాలంటూ కాలేజి బస్సు దిగిన ఓ యువతి ప్రియుడి సూచన మేరకుతల్లిదండ్రులకు తెలియకుండా తిరుపతి వెళ్లిందోరోజు. ఆచూకీ తెలుసుకొని ఇంటికితీసుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చాక వారి కళ్లుగప్పి ఇంటి నుంచి పరారైంది ఇంకోరోజు.ప్రేమలొద్దు బుద్దిగా చదువుకోమని కన్నవారు, బంధువులు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిందని, ప్రవర్తన మార్చుకోకుండా కుటుంబ పరువు తీస్తోందనే కోపంతో డిగ్రీ చదువుతున్న కుమార్తెను హతమార్చారు. సోమవారం వేకువజామున తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

తాళ్లూరు: చెప్పిన మాట పెడచెవిన పెట్టి, ప్రవర్తన మార్చుకోమని చెప్పినా వినకుండా  కుటుంబ పరువు తీస్తోందన్న కోపంతో కుమార్తె గొంతు నులిమి చంపాడు ఓ తండ్రి. ప్రకాశం జిల్లాలో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కోట వెంకటరెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె వైష్ణవి (20) జిల్లా కేంద్రం ఒంగోలులోని ఓ ప్రవేట్‌ కళాశాలలో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. రోజూ కళాశాలకు చెందిన బస్సులోనే వెళ్లేది. అదే కళాశాలలో చదివే లింగసముద్రం గ్రామానికి చెందిన యువకుడితో వైష్ణవి ప్రేమలో పడింది. గత గురువారం కళాశాల బస్సులో వస్తూ ఆస్పత్రికి వెళ్లాలని తోటివారికి చెప్పి మధ్యలో దిగిన వైష్ణవి ప్రియుడి సూచన మేరకు తిరుపతి చేరుకుంది.

తెలుసుకున్న కుటంబ సభ్యులు వెళ్లి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కౌల్సిలింగ్‌ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఆ మర్నాడే స్నానం చేయడానికి అని చెప్పి స్నానాల గదికి వెళ్లిన వైష్ణవి అక్కడి నుంచి మాయమైంది. మార్కాపురంలో ఉందని తెలుసుకుని మళ్లీ తీసుకొచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా వైష్ణవి పద్దతి మార్చుకోక పోవటం, మంచి చెప్పిన బంధువులపై కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటంతో ఆదివారం రాత్రి తండ్రి, కూతురి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున వైష్ణవికి ఆరోగ్యం బాగా లేదంటూ తల్లిదండ్రులు ఆర్‌ఎంపీ వైద్యుడ్ని ఇంటికి పిలిపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ దాచేపల్లి రంగనాథ్, దర్శి సీఐ శ్రీనివాసరావు ఘటనాస్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. యువతి ముఖంపై గాయాలు, మెడపై కమిలినట్టు ఉండటం గమనించారు. గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీఆర్‌ఓ యలమందారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement