లిఫ్ట్‌ అడిగి.. మృత్యుఒడికి.. | Handicapped Died In Scooty Accident West Godavari | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ అడిగి.. మృత్యుఒడికి..

Jul 24 2018 8:18 AM | Updated on Jul 24 2018 8:18 AM

Handicapped Died In Scooty Accident West Godavari - Sakshi

ఘటనాస్థలిలో చిధ్రమైన శివ మృతదేహం

పశ్చిమ గోదావరి, తణుకు: తణుకు మండలం తేతలి వై.జంక్షన్‌  వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దివ్యాంగ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తణుకు రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెం దిన మట్టా సాయిరమేష్‌ తాడేపల్లిగూడెం నుంచి స్వగ్రామానికి మోటారుసైకిల్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో తేతలి వద్ద వల్లూరి శివ (22) లిఫ్ట్‌ అడగడంతో తన మోటారు సైకిల్‌ ఎక్కించుకున్నాడు. తేతలి వై.జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. దీంతో బైక్‌ వెనుక కూర్చున్న శివ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న సాయిరమేష్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో మృతి చెందిన శివ ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం తణుకు వచ్చే క్రమంలో సాయిరమేష్‌ వాహనం ఎక్కాడు. శివ దివ్యాంగుడు కావడంతో మానవతా దృక్పథంతో తన వాహనం ఎక్కించుకున్నట్టు సాయిరమేష్‌ చెబుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు రూరల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల అదుపులో డ్రైవర్‌
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌కు టమాటాల లోడుతో వెళుతున్న వాహనాన్ని స్థానికులు వెంబడించి ఉండ్రాజవరం జంక్షన్‌ వద్ద ఆపి పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి హైవే పెట్రోలింగ్‌ కానిస్టేబుల్‌ లారీ ఎక్కి వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా తాడేపల్లిగూడెం వైపు పోనిచ్చాడు. దీంతో హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది వెంబడించి నారాయణపురం టోల్‌గేటు వద్ద నిలిపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని తణుకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement