మృత్యు శకటం

Groom Died in Bus Accident Tamil nadu - Sakshi

వడపళని డిపోలో విషాదం

దూసుకెళ్లి బస్సు కూలిన గోడ

ఇద్దరు కార్మికులు మృతి

మరో ఆరుగురికి గాయాలు

మృతుల్లో కొత్త పెళ్లి కొడుకు

రవాణా కార్మికుల్లో ఆగ్రహం

సాక్షి, చెన్నై: రవాణా కార్మికుల పాలిట మృత్యు పాశంగా ఓ బస్సు మారింది. మరమ్మతుకు వచ్చిన ఆ బస్సు అదుపుతప్పి గోడను ఢీకొంది. ఆ శిథిలాల కింద ఇద్దరు కార్మికులు విగత జీవులయ్యారు. ఆరుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. మృతుల్లో ఒకరు నవ వరుడు కావడంతో ఆ వధువు వేదన వర్ణణాతీతం. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మిక లోకం బస్సుల్ని నడిపేందుకు ముందుకు రాలేదు. దీంతో వడపళని డిపో నుంచి  ఆదివారం ఉదయం పది గంటల అనంతరం బస్సులు రోడ్డెక్కాయి.

చెన్నై రవాణా సంస్థ పరిధిలో 32 డిపోలు ఉండగా, ఇక్కడ కొత్త బస్సులతో పాటు పాత బస్సులు ఎప్పుడు  బ్రేక్‌ ఫెయిల్‌ అవుతుందో అన్నట్టుగా డ్రైవర్లు అతి కష్టంపై ముందుకు సాగే పరిస్థితి. ప్రతిరోజూ రాత్రి ఆయా బస్సులు డిపోలకు రాగానే,  వాటిని పరిశీలించి, మరమ్మతులు చేయడానికి సిబ్బంది రంగంలోకి దిగుతారు. ఆ దిశగా శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో  వచ్చిన ఓ బస్సు కార్మికుల పాలిట యమపాశంగా మారింది.

హఠాత్తుగా అదుపు తప్పి..
వడపళని బస్టాండ్‌కు అనుకుని ఉన్న డిపోకు వచ్చిన ఓ బస్సును మరమ్మతులు చేయడానికి డ్రైవర్‌ బాల మురుగన్‌ నిర్ణయించారు. ఆ బస్సును యార్డ్‌ వైపుగా తీసుకొచ్చి నిలుపుదల చేసే క్రమంలో హఠాత్తుగా బస్సు అదుపుతప్పింది. బ్రేక్‌ సైతం ఫెయిల్‌ అయినట్టుగా అతి వేగంగా దూసుకెళ్లిన ఆ బస్సు అక్కడి గోడను ఢీ కొంది. అయితే, ఆ గోడ విశ్రాంతి గది కావడంతో విషాదం చోటుచేసుకుంది. రాత్రుల్లో విధుల్లో ఉండే సిబ్బంది అక్కడ టీ తాగుతున్న సమయంలో హఠాత్తుగా గోడ కూలడంతో ఆ శిథిలాల్లో చిక్కుకున్నారు. సహచర సిబ్బంది పరుగున ఆ శిథిలాల్ని తొలగించే యత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ శిథిలాల కింద ఉన్న వారిలో కొందర్ని జీహెచ్‌కు, మరి కొందర్ని స్టాన్లీకి, ఒకర్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఆరుగురు గాయాల పాలు కాగా, ఇద్దరు మాత్రం విగత జీవులయ్యారు. అతి పెద్ద గోడమీద పడడంతో సంఘటన స్థలంలోనే ఇద్దరు మరణించారు. వీరు ఆ డిపోలో టెక్నిషియన్లుగా పనిచేస్తున్న భారతి, శేఖర్‌గా గుర్తించారు. అర్ధరాత్రి వేళ చోటు చేసుకున్న ఈ ఘటన కార్మిక వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది.

ఆగిన సేవలు....
ప్రమాద సమాచారంతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలే ఆ డిపో ఉన్న భవనం 60 ఏళ్ల నాటిది కావడం. దీనికి మరమ్మతులు చేయాలని పదే పదే డిమాండ్‌ చేస్తున్నా, అధి కారులు పట్టించుకోక పోవడం వల్లే, ప్రస్తుతం ప్ర మాదంలో ఇద్దరు కార్మికుల్ని కోల్పోవాల్సి వచ్చిం దన్న ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. దీంతో ఏ ఒక్క బస్సు వడపళని డిపో నుంచి బయటకు రాలేదు. సమాచారం అందుకున్న  రవాణా కార్యదర్శి రాధాకృష్ణన్‌ రంగంలోకి దిగారు. కార్మికులను బుజ్జగించారు. విచారించి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఉదయం పది గంటల అనంతరం డిపో నుంచి బస్సులు రోడ్డెక్కాయి.

నవ వరుడు....
విల్లుపురం జిల్లా సెంజికి చెందిన భారతి టెక్నిషియన్‌గా వడపళని డిపోలో పనిచేస్తున్నాడు. భారతికి అముదాతో ఆదివారం నాటికి వివాహమై 24 రోజులు అవుతోంది. తన భర్త మరణ సమాచారంతో డిపో వద్దకు పరుగులు తీసిన అముదా వేదన వర్ణణాతీతం. ఆ విశ్రాంతి గది వైపుగా చూస్తూ,  ఆమె రోదించడం అక్కడి వారి హృదయాల్ని బరువెక్కించాయి. పెళ్‌లైన రెండోరోజే విధులకు తన భర్త వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె విలపించారు. సెలవు కావాలని పదేపదే విజ్ఞప్తి చేసుకున్నా, అధికారులు ఇవ్వలేదని, ఇప్పుడు ఏకంగా పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, మృతుల్లో మరొకరు శాలిగ్రామంకు చెందిన శేఖర్‌ ఉన్నారు. శేఖర్‌ మరణ సమాచారంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. ఇక, ఈ ఘటన మీద వడపళని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌ బాలమురుగన్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ఆదుకుంటాం....
మృతుల కుటుంబాల్ని రవాణా కార్యదర్శి రాధాకృష్ణన్‌ పరామర్శించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. గాయపడ్డ వారిలో మాశిలామణి, యువరాజ్, తనిగై వేల్, పట్రాజ్, కాశి , బాల మురుగన్‌ ఉన్నారు. డ్రైవర్‌ బాల మురుగన్‌కు స్వల్పగాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడమే కాకుండా, తన ప్రమేయం అన్నది లేకుండా బస్సు వేగంగా దూసుకెళ్లిందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని బాలమురుగన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదం గురించి రాధాకృష్ణన్‌ స్పందిస్తూ, అన్ని బస్సు డిపోల పరిస్థితిపై పరిశీలించి చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇది హఠాత్తుగా జరిగిన ప్రమాదం అని, డ్రైవర్‌ బాల మురుగన్‌ తప్పు చేశాడని, ఇక్కడ ఎవ్వరూ ఇంత వరకు చెప్పలేదని, విచారణ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు  మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంగా తలా రూ.3 లక్షలు ప్రకటించారు. అలాగే, అన్ని డిపోలలో పరిస్థితిపై పరిశీలనకు ఓ కమిటీని రంగంలోకి దించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top