బంగారమే టార్గెట్‌

Gold Robberies in Vizianagaram - Sakshi

వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలు

అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరికలు

విజయనగరం టౌన్‌: నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లలో, కొద్ది రోజులుగా ఎవరూ లేకుండా తాళాలు వేసి ఉన్న ఇళ్లలో ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. కేవలం బంగారు నగలే టార్గెట్‌గా, అంతుచిక్కని రీతిలో సాగుతున్న ఈ దొంగతనాలను తలచుకుంటే ప్రజలు హడలిపోతున్నారు. రెండురోజుల క్రితం కంటోన్మెంట్‌లోని ఉడా కాలనీ ఫేజ్‌–4లో జరిగిన దొంగతనం నుంచి తేరుకోక ముందే, అదే ప్రాంతంలో మరో చోట రెండిళ్లలో వరుస చోరీలు జరిగాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు ఎవరైనా కనపడితే వెంటనే 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులు పలు వివరాలు తెలిపారు.

అభరణాలే లక్ష్యం..
సోమవారం రాత్రి ఉడా కాలనీ ఫేజ్‌–4లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగలు పడ్డారు. విశాఖలోని యాక్సిస్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న విక్రమ్‌ సోమవారం రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు. ఎదురుగా ఉన్న అత్తవారింటికి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు పిర్యాదు చేశారు.  రూ.5 వేల నగదు, ఆభరణాలు పట్టుకుని ఎవరో పరారయ్యారు. అలాగే మెప్మా పీడీ లక్ష్మణరావు ఎంఐజీ– 21లో నివాసం ఉంటున్నారు. పనిమీద శ్రీకాకుళం వెళ్లారు. ఇంట్లో ఒక్కరే ఉండడాన్ని గమనించిన దొంగలు సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. విధులు నిర్వహించుకుని మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన ఆయన ఇంటి తలుపులు తెరిచి, గడియ విరగ్గొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న రూ.8 వేల నగదు, రెండున్నర తులాల బంగారం పోయినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు, క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగి పలు ఆధారాలు సేకరించారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామని, ఇంకా తమకు ఫిర్యాదు చాలా మంది బాధితుల నుంచి అందలేదని ఎస్‌ఐ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top