ఒక్కసారి సూపించండయ్యా..

Girls Missing Case Nalgonda - Sakshi

‘‘అయ్యా.. ఈ ఫొటోలోని చిట్టితల్లి నా బిడ్డయ్యా.. మూడేళ్ల క్రితం సుట్టపోల్ల ఇంటికి వెళ్లోస్తూ కానరాకుండా పోయింది. ఇటీవల సానికొంపల నుంచి పిల్లలను రక్షించి తీసుకొచ్చి నట్టు టీవీ, పేపర్లలో సూచి కడుపుతీపితో వచ్చినం.. ఒక్కసారి ఆ పిల్లలను సూపించండయ్యా..అందులో నా బిడ్డ ఉందేమోనని సూసుకుంటా..’’ అంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతూ పోలీసు అధికారులను ప్రాథేయపడడం అక్కడున్న వారందరినీ కలచివేసింది.

యాదగిరిగుట్ట (ఆలేరు):  ముస్కాన్‌ ఆపరేషన్‌లో భాగంగా ఇటీవల చిన్నారుల అక్రమ రవాణా ముఠా, వ్యభిచార నిర్వాహకుల చెరల్లో నుంచి రక్షించబడిన 15మంది చిన్నారుల్లో తమ కూతురు ఉందని బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన తుంగని నందం–భాగ్యమ్మ దంపతులు శనివారం యాదగిరిగుట్ట టౌన్‌ సీఐ అశోక్‌ కుమార్‌ను  కలిశారు. ఈ సందర్భంగా ఆ దంపతులు మీడియాతో మాట్లాడారు. మాకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కూతురు టి.కల్పన (తప్పిపోయినప్పుడు వయస్సు 11సంవత్సరాలు) బొమ్మలరామారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. 22 ఏప్రిల్‌ 2015న సమీప బంధువుల ఇంటికి వెళ్లి బొమ్మలరామారం మండలం హజీపురం మీదుగా మైసిరెడ్డిపల్లికి మధ్యాహ్నం సుమారు 3గంటల ప్రాం తంలో నడుచుకుంటూ వస్తూ కానరాకుండా పోయింది.

దీంతో బంధువుల ఇంటికి, ఇతర ప్రాంతాల్లో వెతికిన కనిపించలేదు.  వెంటనే కుటుంబసభ్యులు అంతా కలిసి బొమ్మలరామారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండ్రోజులుగా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న పరిణామాలు వివిధ పత్రికల్లో, చానల్స్‌లో రావడంతో వారు శనివారం యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. దీంతో టౌన్‌ సీఐ అశోక్‌ కుమార్‌ను కలిసిన వారు, తమ కూతురు ఉందో చూస్తామని వేడుకున్నారు. పిల్లలు అందరూ   మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్మన్‌గల్‌ ప్రజ్వల హోమ్స్‌లో ఉన్నారని సీఐ అశోక్‌ తెలిపారు. అక్కడికి తీసుకెళ్లి, చిన్నారులను చూపెట్టి, గుర్తుపట్టిన వారిని డీఎన్‌ఏ టెస్టు చేయిస్తామన్నారు.

విచారణ ముమ్మరం : సీఐ అశోక్‌కుమార్‌ 
ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా బాలికల అక్రమ రవాణా కేసును పూర్తిస్థాయిలో ఛేదించేందుకు విచారణ ముమ్మరంగా సాగుతోందని యాదగిరిగుట్ట సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్న వ్యభిచారగృహ నిర్వాహకుల ముఠాసభ్యులు 14మంది, ఆర్‌ఎంపీ డాక్టర్‌ను అరెస్టు చేశామని, వీరి నుంచి 15మంది చిన్నారులను రక్షించామని తెలిపారు. పట్టుబడిన ముఠాతో పాటు వైద్యుడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించామని, చిన్నారులను మహబూబ్‌నగర్‌లోని ప్రజ్వల పాఠశాలలో చేర్పించామని వెల్లడించారు. దొరికిన చిన్నారుల్లో మా పిల్లలు ఉన్నారని వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు.

పిల్లల గురించి తెలుసుకోవాలంటే ప్రజ్వల స్కూల్‌కు తీసుకెళ్తున్నామని, అక్కడ డీఎన్‌ఏ టెస్టులు చేయించి, అధికారుల సూచనలతో తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. నేరస్తుల మీద వివిధ ఐపీసీ సెక్షన్లు, హ్యూమన్‌ అండ్‌ ట్య్రాపరింగ్, డాక్టర్‌పై చీటింగ్‌ కేసు, ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్టు, డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ కేసు నమోదు చేశామన్నారు. దాడులు జరుగుతున్నాయని భయానికి కొంతమంది వ్యభిచార నిర్వాహకులు ఇక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం ఉందన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. అంతే కాకుండా తమ దగ్గర మరికొంత సమాచారం ఉందని, విచారణ చేసి చిన్నారులను వారి దగ్గరి నుంచి రక్షిస్తామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top