తెలిసిన వాడని ఆశ్రయమిస్తే.. 

Girl Child Kidnap Case In Ramgopalpet At Hyderabad - Sakshi

బాలికలను కిడ్నాప్‌ చేసిన వైనం

12 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: తెలిసిన వాడిగా ఉంటూ ఓ వ్యక్తి ఐదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి పరారయ్యాడు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ మర్కెలి జిన్నారంకు చెందిన ముద్దనగుల తిరుపతి రాజు, నాగమణిలు భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల అనుష్క అనే కుమార్తె ఉంది. గత కొద్ది నెలల నుంచి వీరు ఉపాధి కోసం శంషాబాద్‌ కవిరెడ్డికాలనీకి వచ్చి కారి్మకులుగా పనిచేస్తున్నారు. గత ఆరు నెలల క్రితం వీరితో పాటు సిద్దిపేట జిల్లా గురువన్నపేటకు చెందిన శివ పనిచేశాడు. గత ఐదు రోజుల క్రితం మళ్లీ తిరుపతి రాజు వద్దకు వచ్చిన శివ వీరితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం శివ, తిరుపతిరాజులు కల్లు తాగారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరుపతి రాజు కుటుంబం యాదగిరిగుట్టకు వెళ్లడానికి శంషాబాద్‌ నుంచి రైలులో కాచిగూడకు వచ్చారు. వారితో పాటు శివ కూడా వచ్చాడు.

కాచిగూడలో రైలు దిగి ఎంఎంటీఎస్‌లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రాంతంలోని కారు పార్కింగ్‌ వద్ద అందరూ ఉన్నారు. తినడానికి ఏదైనా తీసుకుని వచ్చేందుకు తిరుపతి రాజు, ఆయన భార్య ఇద్దరు బయటకు వెళ్లగా శివ వద్ద వారి కుమార్తె అనుష్కను ఉంచి వెళ్లారు. వాళ్లు తిరిగి వచ్చేసరికి అక్కడ శివతో పాటు వారి కుమార్తె కూడా కనిపించలేదు. రైల్వే స్టేషన్‌ చుట్టు పక్కల గాలించినా ఇద్దరి ఆచూకీ కనిపించలేదు. దీంతో రాత్రి గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ డీఐ వెంకటేశ్వర్లుతో పాటు యుగంధర్‌రెడ్డి తదితర సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. 

పోలీసుల అదుపులో నిందితుడు
బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లిన నిందితుడు శివను పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కిడ్నాప్‌కు గురైన బాలిక సురక్షితంగా పోలీసులు రక్షించారు. రాయగిరి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బాలికను పోలీసులు నగరానికి తీసుకునివచ్చారు.  ఫిర్యాదు చేసిన 12 గంటల్లోపు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వచ్చి విచారణ చేపట్టారు. శివ గతంలో కొన్ని దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ఆదివారం నిందితున్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top