ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప 

Garidepally Deputy Tahsildar Caught Red Handed By ACB Taking Bribe - Sakshi

గరిడేపల్లి రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ దాడులు

పహాణీలకోసం రైతునుంచి రూ.8వేలు డిమాండ్‌

లంచం తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్న అధికారులు

గరిడేపల్లి :  ఏసీబీ అధికారుల దాడులతో గరిడేపల్లి రెవెన్యూ కార్యాలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం ఒక రైతు నుంచి లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్, కార్యాలయంలో పని చేస్తున్న ఒక ప్రైవేట్‌ వ్యక్తి ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  వివరాలిలా.. మండలంలోని కుతుబ్‌షాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్యకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన రికార్డులు మార్చి రెవెన్యూ సిబ్బంది పట్టా చేశారు. లింగయ్య బతుకు దెరువు కోసం వెళ్లి కొంతకాలంగా హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో నివాసం ఉంటున్నాడు. గత  ఏడు సంవత్సరాలుగా కుతుబ్‌షాపురంలో ఉన్న భూమిని గుడుగుంట్ల వెంకయ్య అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. అయితే రెండేళ్లుగా కౌలు ఇవ్వటం లేదని లింగయ్య తెలిపాడు. కుతుబ్‌షాపురానికి చెందిన కొంతమంది భూమి పట్టా మార్చుకున్నారని లింగయ్యకు తెలిసింది.

దీంతో లింగయ్య గరిడేపల్లిలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాడు. తన పేరు మీద ఉన్న సర్వే నంబర్‌ 399లోని భూమిని తన అక్క లక్ష్మి, వెంకయ్యల పేరు మీద పట్టా అయినట్లు రికార్డుల్లో ఉండడంతో అవాక్కయ్యాడు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్‌  సత్యనారాయణ వద్దకు వెళ్లి అడగగా రూ.20వేల లంచం ఇస్తే నీ పేరు మీద పట్టా ఇస్తానని చెప్పినట్లు బాధితుడు లింగయ్య తెలిపాడు. తన వద్ద డబ్బులు లేవని, పేద వ్యక్తినని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో 1980 నుంచి ఉన్న పాత పహాణీలు ఇవ్వాలని డీటీని కోరినట్లు తెలిపాడు. పహాణీలకు కూడా రూ.15వేల లంచం ఇస్తేనే అందజేస్తానని డీటీ చెప్పటంతో రూ.8వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. లింగయ్య సోమవారం డబ్బులు తీసుకుని కార్యాలయానికి వెళ్లగా అక్కడ  పని చేస్తున్న ప్రైవేట్‌ వ్యక్తి పయిడిమర్రి ప్రకాశంకు ఇవ్వాలని డీటీ సూచించాడు. రూ.8వేలు పయిడిమర్రి ప్రకాశానికి అప్పజెప్పగానే పహాణీలు ఇచ్చాడు.

అదే సమయంలో అక్కడే కాచుకునివున్న ఏసీబీ అధికారులు ప్రకాశంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కాగా కార్యాలయానికి వచ్చిన రైతుల సమస్యలను ఏసీబీ అధికారులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ నల్లగొండ రేంజ్‌ అధికారి ఏపీ ఆనంద్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ గరిడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌ బండారు సత్యనారాయణ సూచన మేరకు కార్యాలయంలో పని చేస్తున్న ప్రైవేట్‌ వ్యక్తి ప్రకాశం కుతుబ్‌షాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్య అనే రైతు నుంచి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా అవినీతికి పాల్పడినా, లంచం అడిగినా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్, సీఐ రఘుబాబు, వెంకటరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top