మొబైల్‌ గాంబ్లింగ్‌ మత్తులో యువత | Gambling And Cricket Bettings in Chittoor | Sakshi
Sakshi News home page

మొబైల్‌ గాంబ్లింగ్‌ మత్తులో యువత

Feb 25 2019 11:21 AM | Updated on Feb 25 2019 11:21 AM

Gambling And Cricket Bettings in Chittoor - Sakshi

పేకాట తదితర జూదాలకు ఇప్పుడు కాలం చెల్లింది. సాంకేతిక పుణ్యమా అని స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే ఎలాంటి జూదమైనా సాఫీగా ఆడుకోవచ్చు. ఇన్నాళ్లు  క్యాండీక్రష్‌లాంటి గేమ్స్‌ ఆడుతున్న యువత మనసు ఇప్పుడు బెట్టింగ్‌ గేమ్‌లపై పడింది. జిల్లాలో ఎటుచూసినా యువతనోట ఎంజీ మాటే. ఈ జూదానికి బానిసైనవారిలో కళాశాలల విద్యార్థులుండడం బాధాకరం. కొన్నాళ్లుగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది జరిగేది. నేడు మండల కేంద్రాలకు ఇది వ్యాపించింది. రూ.10 నుంచి వేలల్లో సాగే ఈ బెట్టింగులతో నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

చిత్తూరు :గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగేది. ఇప్పుడు ట్రెండ్‌మారింది. ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్న కొత్త మొబైల్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్‌లు వందల సంఖ్యలో ఉన్నాయి. స్మార్ట్‌ కాíసినోస్, ప్లే కార్డ్‌ ఎక్స్‌ప్రెస్, రమ్మీ, రియల్‌ మనీ క్యాసినో, ఫాస్ట్‌ బెట్టింగ్, ఈజీటు ఎర్న్, క్యాండీక్రష్‌ బెట్టింగ్‌ ఇలా రకరకాల బెట్టింగ్‌లు ఉన్నాయి. ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే గ్యాంబ్లిగ్‌ యాప్స్‌ వందల్లో ఉన్నాయి. ఇందులో బిగ్‌టైమ్, రాలెట్‌ రాయల్, బ్లాక్‌ జాక్, స్లాట్‌ మిషీన్, లకీడే,స్పిన్‌టు విన్, హార్స్‌ బెట్టింగ్, సూపర్‌ స్నేక్, జాక్‌పాట్‌ రాజా, టీన్‌పతి గోల్డ్,బింగో లాంటి గేమ్స్‌లో నిమిషాల్లో బెట్టింగ్‌ జరుగుతోంది.

నలుగురు కలిస్తే బెట్టింగ్‌లే
మామూలుగా క్రికెట్‌ ఆడుకోవడానికి వెళ్లే యూత్‌ ఎక్కువగా వీటికి బానిసలవుతున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ల కంటే చాలా సులభంగా నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా ఆడుతున్నారు.  ముఖ్యంగా విద్యార్థులు కళాశాలలకు కూడా వెళ్లకుండా ఈ మత్తులోనే వేలకు వేలు పోగొట్టుకుంటున్నారు. బంగారు ఆభరణాలు, మొబైల్‌ఫోన్‌లు, బైక్‌లు సైతం బెట్టింగ్‌లలో పోగొట్టుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా చదువులు కొండెక్కడంతోపాటు మంచి భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. రైళ్లలో, బస్సుల్లో కూడా రాత్రుళ్లు మేలుకుని కూడా ఈ గేమ్స్‌ ఆడుతున్నారు.

పోలీసులు కనుక్కోలేరు
జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె,పలమనేరులో యూత్‌ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఈ ప్రాంతాలకు వెళ్లినా క్రికెట్‌ ఆడుతున్నామనో, స్మార్ట్‌ ఫోన్‌లో గేమ్స్‌ అనో చెబుతున్నారు. వీరి వద్ద జూదానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఉండవు కాబట్టి పోలీసులు సైతం ఏం చేయలేక పోతున్నారు. జూదానికి బానిసలుగా మారిన తమ పిల్లలను ఎలా దారినపెట్టాలో అర్థంగాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా కొత్తగా వచ్చిన రకరకాల జూదాలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement